Jan 10,2022 08:39

సంక్రాంతి అంటే రంగవల్లులతో పాటు నోరూరించే పిండివంటలూ ఉండాల్సిందే.
ఎప్పుడూ అరిసెలు, జంతికలు, పప్పు చెక్కలు, కజ్జికాయలు చేసుకోవడం పరిపాటి.
కానీ ఈసారి వాటినే వెరైటీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం.
ఇంకెందుకాలస్యం ఇంటిల్లిపాది పండుగను పసందుగా చేసుకోండి.



                                                            నువ్వుల అరిసెలు

నువ్వుల అరిసెలు

కావాల్సిన పదార్థాలు :
బియ్యం - కేజీ, బెల్లం - అరకేజీ, యాలకుల పొడి - టీస్పూన్‌, నువ్వులు - 50 గ్రాములు, నూనె - వేయించడానికి సరిపడా.
 

తయారుచేసే విధానం :
ముందుగా బియ్యాన్ని రోజంతా నానబెట్టాలి. తరువాత వాటిని మెత్తటి పిండిలా పట్టుకోవాలి.
ఒక పాన్‌ తీసుకొని స్టవ్‌పై పెట్టి, బెల్లం వేసి, కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై మరిగించాలి.
బెల్లం కరిగి పాకం తయారయ్యాక నువ్వులు వేయాలి.
చివరిలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి.
స్టవ్‌ ఆఫ్‌ చేసి, బియ్యం పిండిని అందులో వేసి ఉండలు లేకుండా ఒకరు తిప్పుతూ ఉంటే, మరొకరు పిండి పోస్తూ కలుపుకోవాలి. మరీ లూజుగా కాకుండా సరిపోనూ పిండి వేసుకోవాలి.
చేతులకు కొద్దిగా నూనె రాసుకుంటూ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని, అరెసలను అరిటాకుపైగానీ, పాలిథిన్‌ పేపర్‌పైగానీ ఒత్తుకోవాలి.
స్టవ్‌పై కళాయి పెట్టి, నూనె వేడయ్యాక ఒత్తిన అరిసెలు వేసి వేగించుకోవాలి. రెండు వైపులా సమంగా వేగేలా బంగారువర్ణంలో వచ్చేలా చూసుకోవాలి.
వేగించిన అరిసెలను చెక్కలతో ఒత్తుకోవాలి. తర్వాత ఆరబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.


                                                              జొన్న జంతికలు

 జొన్న జంతికలు

కావాల్సిన పదార్థాలు : జొన్నపిండి- రెండు కప్పులు, బియ్యప్పిండి- కప్పు, ఉప్పు- సరిపడా, కారం- స్పూన్‌, వాము- అరస్పూన్‌ (కాస్త నలపాలి), జీలకర్ర- స్పూన్‌, తెల్లనువ్వులు- స్పూన్‌.
 

తయారుచేసే విధానం :
వెడల్పాటి గిన్నెలో జొన్నపిండి, బియ్యప్పిండి, మిగిలిన పదార్థాలన్నీ వేసి.. కాస్త నూనె వేడిచేసి పోయాలి.
తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ, చపాతీ పిండిలా కలపాలి.
కళాయిలో నూనెపోసి, వేడిచేసి చక్రాల గిద్దలతో ఒత్తుకోవాలి. వీటిని రెండువైపులా వేగించాలి.
ఒత్తుకునే ముందు చక్రాల గిద్దలకు నూనె రాస్తే నున్నగా వస్తాయి.

                                                                డ్త్రెఫ్రూట్‌ కజ్జికాయలు

  డ్త్రెఫ్రూట్‌ కజ్జికాయలు

కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి- నాలుగు కప్పులు, బాదం, జీడిపప్పు, పిస్తా, వేరు శనగలు- ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున (అన్నింటినీ పొడి చేసుకోవాలి), యాలకుల పొడి- స్పూను, బెల్లం- రెండు కప్పులు, నూనె- రెండు కప్పులు, వంటసోడా- చిటికెడు, కొబ్బరి తురుము- అరకప్పు.
 

తయారుచేసే విధానం :
ముందుగా గిన్నెలో మైదాపిండి రెండు కప్పులు తీసుకొని, అందులో వంటసోడా, కాసిని నీళ్లు పోసి, చపాతీ పిండిలా కలుపుకోవాలి.
తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసి, చపాతీల్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశనగలను పొడి చేసి పెట్టుకోవాలి. అందులో యాలకుల పొడి, కొబ్బరి తురుము, బెల్లం తురుము కలిపి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాలి.
ఈ మిశ్రమాన్ని చపాతీలో ఉంచి.. కజ్జికాయ ఆకారంలో ఒత్తుకోవాలి.
పాన్‌లో నూనె పోసి స్టవ్‌పై పెట్టి, అది వేడెక్కాక తయారుచేసుకున్న కజ్జికాయలను వేగించుకొంటే సరిపోతుంది.

                                                          సొరకాయ చెక్కలు

సొరకాయ చెక్కలు

కావాల్సిన పదార్థాలు : బియ్యప్పిండి - 3 కప్పులు, లేత సొరకాయ తురుము - కప్పు, పచ్చిమిర్చి పేస్టు - 2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను, కరివేపాకు తరుగు - స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, నువ్వులు - 2 స్పూన్లు, జీలకర్ర - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, వంటసోడా - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా.
 

తయారుచేసే విధానం :
ఒక పాత్రలో సొరకాయ తురుము, బియ్యప్పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, మిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, సోడా, నువ్వులు, జీలకర్ర వేయాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి, చపాతి పిండిలా కలుపుకోవాలి.
తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి, వేగించడానికి సరిపడా నూనె పోసి వేడిచేయాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి, నూనె రాసిన ప్లాస్టిక్‌ పేపరు మీద చెక్కలు వత్తుకుని, నూనెలో దోరగా వేగించాలి.
అంతే ఎంతో రుచిగా వుండే సొరకాయ చెక్కలు రెడీ.