Jul 21,2021 21:37

ప్రజాశక్తి-అమరావతి : కృష్ణా జిల్లాలోని కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టు ల్యాండ్‌లో అక్రమంగా మైనింగ్‌ చేయడమే కాకుండా పంట కాలువే లేకుండా చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అటవీ భూముల్లో మైనింగ్‌ చేయడాన్ని అధికారులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించింది. పంట కాలువను పూడ్చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు పూడ్చేశారని, దీనిని తిరిగి నిర్మించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని, అటవీ భూముల అక్రమ మైనింగ్‌పై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ మాజీ ఎమ్మెల్సీ టిజివి కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ ఆగస్టు 23కు వాయిదా పడింది.

* హైకోర్టు, కింది కోర్టులు, ట్రిబ్యునల్స్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును హైకోర్టు మరోసారి పొడిగించింది. ఏప్రిల్‌ 21 నాటికి అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులన్నీ ఆగస్టు 23 వరకు పొడిగించింది. కరోనా నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది.

* నెల్లూరులోని విక్రమ సింహపూరి యూనివర్సిటీ విసి ప్రొఫెసర్‌ ఆర్‌.సుదర్శనరావు నియామకం రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జిఓ అమలును నిలిపివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు ఉత్తర్వులిచ్చారు. సుదర్శన్‌రావు హైకోర్టులో సవాల్‌ చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సోమయాజులు విచారణ జరిపారు. నోటీసు కూడా ఇవ్వకుండా రద్దు చేశారని, తిరిగి విసిగా నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు. దీంతో సుదర్శన్‌రావును విసిగా రద్దు చేయడంపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.