Nov 23,2021 08:24

చాలా మందిని వేధించే సమస్య పంటి నొప్పి. దంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్‌, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధులు తదితర కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది. ఒక్కసారి పంటి నొప్పి వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఈ పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం..
లవంగాల్లో ఉండే యుగేనల్‌ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. నొప్పి వచ్చే దంతం దగ్గర లవంగాన్ని ఉంచి నెమ్మదిగా నములుతూ ఉంటే నూనె విడుదలై పంటి నొప్పి తగ్గుముఖం పడుతుంది. మార్కెట్లో లభించే లవంగ నూనె అయితే నేరుగా రాయకుండా దూదిపై రెండు చుక్కలు వేసి దంతంపై ఉంచాలి.
ఉప్పు కరిగించిన గోరువెచ్చని నీరు సహజమైన యాంటిసెప్టిక్‌లా పని చేస్తుంది. ఈ నీటిని కనీసం 30 సెకన్లపాటు పుక్కిలించడం వల్ల దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్తాయి. రోజులో ఎక్కువ సార్లు ఇలా చేస్తూవుంటే ఇన్ఫెక్షన్‌ పెరగకుండా, సూక్ష్మజీవులు నశించి నొప్పి తగ్గిపోతుంది.
ఐస్‌ క్యూబులను ప్లాస్టిక్‌ బ్యాగులో వేసి పలుచటి గుడ్డతో చుట్టాలి. నొప్పి పంటిపై ఈ బ్యాగుతో నెమ్మదిగా ఒత్తడం వల్ల వాపు వల్ల వచ్చిన నొప్పి తగ్గుతుంది.
వెల్లుల్లిలో అధికంగా ఉండే యాంటి బయోటిక్‌ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లిని దంచి టేబుల్‌ సాల్ట్‌ లేదా మిరియాల పొడితో కలిపి పంటిపై ఉంచడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.