Oct 18,2020 23:47

మాట్లాడుతున్న మహీధర్‌రెడ్డి, కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్న మహీధర్‌రెడ్డి,చంద్రశేఖర్‌రెడ్డి

ప్రజాశక్తి-లింగసముద్రం: పంటల సాగుకు రాళ్లపాడు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు కందుకూరు, ఉదయగిరి ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆదివారం ఉదయం 10.30లకు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. రెండు కాలువల ద్వారా 220 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంపూర్ణ సహకారంతోనే రాళ్లపాడు ఆయకట్టు రైతాంగానికి నీటిని ఇవ్వగలుగుతున్నామని అన్నారు. రాళ్లపాడు రైతాంగం గత ఆరేళ్లుగా కరువుతో తీవ్ర ఇబ్బందులతో వలసలు వెళ్లినట్లు చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఆయకట్టుకు నీరిస్తామని ముందుగానే ప్రకటించినట్లు వివరించారు. దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడిందన్నారు. సాగుకు పుష్కలంగా నీటిని సరఫరా అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 17.4 అడుగులు మేర నీరు ఉంది. పంటకు కావాల్సిన నీటిని తీసుకొచ్చే బాధ్యత తమదని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాళ్లపాడులో నీటిని నింపడంలో మహీధర్‌రెడ్డి కృషి అభినందనీయమని అన్నారు. కొండాపురం మండలంలోని గ్రామాల్లో రాళ్లపాడు నీటిని అక్రమ తరలింపు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు కుడి కాలువపై ఏడుగురు లష్కర్లను నియమించినట్లు ఈఈ శరత్‌కుమార్‌ చెప్పారు. కార్యక్రమంలో ఎఎంసి వైస్‌ చైర్మన్‌ ఎం.శ్రీనివాసులు, వైసిపి మండల కన్వీనర్‌ పి.తిరుపతిరెడ్డి, లాయర్‌ పెన్నా క్రిష్ణయ్య, వైసిపి నాయకులు వి.క్రిష్ణారెడ్డి, కె.వెంకటేశ్వర్లు యాదవ్‌, నోటి వెంకటేశ్వర్లు, సూరం కొండారెడ్డి, ఎం.మాలకొండారెడ్డి, యు.నాగేశ్వరరావు, పి.బాలకోటయ్య, దగ్గు వెంకటేశ్వర్లు, డి.మాధవ, వి.కొండారెడ్డి, ఆర్‌.మాలకొండయ్య, సిహెచ్‌ శ్రీనివాసులు, డిఇ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.