Apr 07,2021 19:10

న్యూఢిల్లీ : దేశంలో ఓవైపు కరోనా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోపక్క దాన్ని ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు వ్యాక్సిన్లు పంపి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో వాక్సిన్‌ అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పనిచేసే ప్రదేశాల్లోనూ (ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు) కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. అయితే, ఓ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలంటే కనీసం 100 మంది సిద్ధంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్లకు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఈ నెలలో అనేక సెలవులు ఉన్నప్పటికీ, కరోనా టీకా డోసులను ప్రతిరోజు వేయాలని నిర్ణయించారు.