Sep 20,2023 00:12
ఎంఒకు వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: పని సర్దుబాటులో అవకతవకలను సరిచేయాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఒ జె ప్రసాదరావును కలిశారు. సిఎస్‌ పురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇప్పటికే అనేక పోస్టులు ఖాళీ ఉండగా తిరిగి అదే పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌ వేయడం, ముల్లపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిని అదే కాంప్లెక్స్‌ పరిధిలోని ఏకునాపురం పాఠశాలకు సర్దుబాటు చేయకుండా సుదూర ప్రాంతంలో ఉన్న పిల్లిపల్లి పాఠశాలకు పంపించి గుంతచెన్నంపల్లి పాఠశాల నుంచి ఏకునాంపురం పాఠశాలకు వేరే ఉపాధ్యాయుడిని వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఏకుమాపురం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడిని వడ్డేపాలెం పాఠశాలకు పంపించడం ఎందుకో తమకు అర్థం కావడం లేదని అన్నారు. సాధారణ సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలు తెలియజేసే విధంగా ఎమ్మార్పీ కార్యాలయంలో రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ ప్రసాదరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఇర్ల కొండయ్య, ఎన్‌ వెంకట్రామయ్య, షేక్‌ బాదుషా, పఠాన్‌ నాయబ్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.