Jul 29,2021 23:51

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

సిరిపురం : విలువ ఆధారిత ఆస్తి పన్ను, చెత్తపై యూజర్‌ ఛార్జీలపై పాలకులు, అధికారులు పునరాలోచించాలని వార్వా, నివాస్‌ ప్రతినిధులు కోరారు. సిరిపురంలోని దత్త ఐలాండ్‌లోని సిఐఐ కాన్ఫరెన్స్‌ హాల్లో వార్వా, నివాస్‌ ఆధ్వర్యాన గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మధురవాడ, గోపాలపట్నం, ఆటోనగర్‌తో పాటు 23 ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆస్తి పన్ను విధాన మార్పులను, చెత్తపై యూజర్‌ చార్జీలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి పన్నులు కడుతూ సిటీలో బతకలేమని, వీటిని ఎలాగైనా తిప్పి కొట్టాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పన్నులపై నిరసన ప్రదర్శనలు, పాదయాత్రలు, సంతకాల ఉద్యమాలు, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం, కోర్టులో న్యాయపోరాటం చెయ్యాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో టి కామేశ్వరరావు, బిబి గణేష్‌, పి.నారాయణ మూర్తి, ఉదరు శీర్ణమే పాల్గొన్నారు.
కూర్మన్నపాలెం : పన్నులను నిరసిస్తూ కూర్మన్నపాలెం షకీలా సెంటర్లో ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు, నినాదాలతో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.రామారావు, కె.వేణు, కృష్ణార్జున, కె.సత్యనారాయణ, ఎం.గౌరీశంకరరావు, రాంబాబు, కె.గంగాధర్‌, శంకరరావు, ఆనంద్‌, దత్తు పాల్గొన్నారు.