Jun 22,2021 20:14

ప్రజాశక్తి - పెరవలి
పెరవలిలో జరుగుతున్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపిడిఒ వానపల్లి విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఎంపిడిఒ ఆయా పనులను పరిశీలించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ విస్తరణ అధికారి నరసింహమూర్తి, పంచాయతీరాజ్‌ ఎఇ రెడ్డి, గ్రామ నాయకులు మణిబాబు పాల్గొన్నారు.
నిడమర్రు : గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు త్వరగా పూర్తిచేయాలని ఎంపిడిఒ టిఎస్‌ మహాలక్ష్మి అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం మందలపర్రులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాన్ని ఈ నెల 30న పూర్తిచేయాలని, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని జులై ఎనిమిది కల్లా పూర్తి చేయాలని తెలిపారు. భవన నిర్మాణాలు నాణ్యతగా ఉండే విధంగా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దెందుకూరి సూర్యకాంతం, ఇఒపిఆర్‌డి విజయ భాస్కర్‌ రావు, వైసిపి నాయకులు దెందుకూరి త్రిమూర్తి రాజు పాల్గొన్నారు.