Sep 15,2021 07:25
  • వెంటనే పూర్తి చేయండి లేదా వాపసు ఇవ్వండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో పాటు ఎడిబి లేఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు రుణాలు మంజూరవుతున్నప్పటికీ పనులు జరగడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎడిబి) అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు అందినట్లు తెలిసింది. 'పనులు పూర్తి చేయండి, లేదా రుణ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయండి. ఒకవేళ పనులు జరిగిపోయి ఉంటే రుణ ఖాతాలను మూసి వేయండి' అని ఈ లేఖల్లో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఆరు పథకాలకు 1347 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఎడిబి కేటాయించింది. ఇందులో 437 మిలియన్‌ డాలర్లను ఇప్పటికే విడుదల చేసింది. ఈ మొత్తంలో కొరత వ్యయంకాగా, ఇంకా దాదాపు 124 మిలియన్‌ డాలర్లు (సుమారుగా 900 కోట్ల రూపాయలు) వ్యయం కాకుండా మిగిలిపోయాయి. ఆ ఆరు పథకాల్లో నాలుగు పథకాలకు సంబంధించిన తుది విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ వ్యయం మాత్రం సజావుగా సాగకపోవడంపై ఎడిబి, కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఎపి డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టుకు వచ్చే ఏడాది సెప్టెంబర్‌, పవర్‌ టు ఆల్‌ ప్రాజెక్టు రెండు దశలకు వచ్చే జూన్‌, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టుకు 2023 జూన్‌లో తుది విడత రుణం విడుదల కావాల్సి ఉంది. వీటిని పూర్తి చేయడంలో జాప్యం పెరుగుతోందని కేంద్రం తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. వినియోగించిన రుణ మొత్తం ఏమాత్రం అధికంగా లేదని, వడ్డీ రేటు కూడా గణనీయంగా పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ నిధులు ప్రభుత్వం వద్ద, పథకాల అమలు ఏజెన్సీల వద్ద ఉండిపోయాయని పేర్కొంది. ఈ నిధులు కూడా ఇతర అవసరాలకు మళ్లిపోయి ఉంటాయన్న అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.