
ప్రజాశక్తి -కలెక్టరేట్ : పొగాకు వినియోగంతో కేన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని బుధవారం జిల్లా ఆసుపత్రి వద్ద ఆయన ప్రారంభించారు. పొగాకు వ్యతిరేక నినాదాలతో ఈ ర్యాలీ స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ వరకు నిర్వహించారు. అనంతరం డాక్టర్ జగన్నాథరావు మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే నష్టాలను అందరికీ తెలిపేందుకు, అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించడమైనదనీ, ప్రతి సంవత్సరం మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారని, పొగాకు వినియోగాన్ని తగ్గించకుంటూ పోవడమే దీని లక్ష్యమని అన్నారు. పొగాకు తాగడం వల్ల క్యాన్సర్‌కు గురై ప్రతి ఏటా చాలా మంది మరణిస్తున్నారన్నారు. చుట్టా, బీడీ, సిగరెట్టు మొదలగు వాటిని తాగటం, వాటికి బానిస అవ్వడం వల్ల ఊపిరితిత్తులు, కేన్సర్, నోటి కేన్సర్, గుండె వ్యాధులు సంభవిస్తాయన్నారు. పొగతాగే వారితో పాటు దాన్ని పీల్చడం వల్ల కుటుంబంలో ఇతరుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన ర్యాలీలు వైద్య సిబ్బంది నిర్వహించారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి. వాగ్దేవి, డిఐఒ డాక్టర్ టి.జగన్మోహనరావు, డిసిఎమ్ భవాని, డెమోలు యోగీశ్వర రెడ్డి, సన్యాసిరావు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలకొండ : ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా ఎపివిహెచ్‌ఎ గుంటూరు సౌజన్యంతో స్థానిక జన చేతన సంస్ధ ఆధ్వర్యంలో పట్టణ కూడలిల్లో భవన కార్మికులకు, అంపిలి గ్రామ పరిసరాల్లో ఉపాధి హామీ కూలీలకు ''ప్రాణాలను పీల్చేస్తున్న పొగాకు'' 2023 సంవత్సరం అంశం (థీమ్)''ఆహారం కావాలి - పొగాకు కాదు'' అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా పొగాకు రహిత సమాజం కోసం మనం పాటించాల్సిన నియమాలు, ఉత్తమ మార్గాలు, ధూమపానం, పొగాకు వల్ల కలిగే ఇబ్బందులు, పర్యావరణంపై ప్రభావం, పేదరికానికి కారణాలు మొదలైన అంశాలపై జనచేతన ముద్రించిన కరపత్రాలను అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనచేతన కార్యదర్శి బగాది శశి భూషణచౌదరి మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ చాలా ప్రమాదరమైనవి, కేన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులకు గురిచేస్తుందని అన్నారు. వాటి జోలికి పోకూడదని హితవు పలికారు. ఎన్‌ఆర్‌ఇజిఎ ఫీల్డ్ ఆఫీసర్ బూరాడ రమాదేవి మాట్లాడుతూ సిగరెట్ కాల్చేవారి కంటే ఆ పొగ పీల్చే వారికే ఎక్కువ ప్రమాదమని అన్నారు. కావున ఎవరైనా ఆరుబయట పొగ పీల్చరాదన్నారు. కార్యక్రమంలో జన చేతన సిబ్బంది ఎం.సరస్వతి, ఎల్.కృష్ణారావు, శివ కుమార్, యోగేశ్వర రావు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ మేట్ లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం: ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక పిహెచ్‌సి నుండి మెయిన్ రోడ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పొగాకు వ్యతిరేకంగా స్లొగన్స్ ఇచ్చారు. ర్యాలీలో వైద్యాధికారి వైద్యాధికారి శిరీష, సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పిలు, హెల్త్ అసిస్టెంట్లు, ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ప్రధాన కూడలి వద్ద మానవహారం చేస్తూ ప్రజలందరికీ పొగాకు, గుట్కా వంటి వాటి గురించి వివరిస్తూ నినాదాలు ఇచ్చారు.
వీరఘట్టం : పొగకు పీల్చడం ఆరోగ్యానికి హానికరమని స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి పి.ఉమామహేశ్వరి ప్రజలను కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు వద్దు ఆరోగ్యం ముద్దు, మందు, సిగరెట్ వద్దు పౌష్టికాహారం ముద్దు, చుట్టా, బీడీ సిగరెట్టు ప్రాణానికి పెనుముప్పు, పొగాతాగవద్దు క్యాన్సర్‌కు గురికావద్దు గుండె జబ్బులకు కారణం ధూమపానం తదితర అంశాలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఒ.శాంత కుమారి, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.