May 15,2022 08:12

వెయిసిన్హాస్‌, జర్మనీ : ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆహార, ఇంధన సంక్షోభం పొంచి ఉందని జి 7 దేశాలు హెచ్చరించాయి. పేద దేశాలను ఈ పరిస్థితులు మరింతగా దెబ్బతీస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ఓడరేవుల్లో చిక్కుకుపోయిన ఆహార ధాన్యాల ఎగుమతులు సత్వరమే సాగేలా చూసేందుకు అత్యవసర చర్యలు అవసరమని పేర్కొన్నాయి. జర్మనీలోని బాల్టిక్‌ సముద్ర తీరంలో మూడు రోజుల పాటు జరిగిన సమావేశం ముగిసిన అనంతరం జి 7 దేశాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్‌లో మాస్కో చర్యలను సమర్ధించడం లేదా అంతర్జాతీయ ఆంక్షలను దెబ్బతీయడం ద్వారా రష్యాకు సాయపడవద్దు'' అని చైనాను కోరాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆహార ధాన్యాల సరఫరాలో ఎదురవుతున్న చిక్కులపై రష్యాతో చర్చించేందుకు తాము సిద్ధంగా వున్నామని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అన్నారు.