Jul 03,2022 23:51

బైక్‌ ర్యాలీ ప్రారంభిస్తున్న రత్తమ్మ

5న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా
ప్రజాశక్తి - ఎటపాక
: పోడు భూముల రక్షణ, అటవీ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈనెల 5న తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పోడు భూములకు రక్షణ కల్పించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యురాలు పోడియం రత్తమ్మ జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. మాధవరావుపేట నుండి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ లక్ష్మీపురం, కన్నాపురం ,బురుగువాయి, పాలమడుగుల మీదుగా రాంగోపాల్‌ వరకు కొనసాగింది. అనంతరం మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పోడుసాగుదారులపై రెండు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని, వసూళ్ల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సిపిఎం ప్రజా ప్రతినిధులు ఉన్నంతకాలం పోడుభూముల్లోకి అటవీశాఖ అధికారులు వచ్చేవారు కాదని, సిపిఎం ప్రజాప్రతినిధులు లేరని గిరిజనులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ఎర్రజెండా అండగా పోరాటం చేస్తామని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే వాడవాడలా ఎర్రజెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. పోడు భూముల సమస్య, ఉపాధి హామీ బిల్లులు, రేషన్‌ కార్డు, పెన్షన్‌, ఇళ్ల స్థలాలు, హౌసింగ్‌ కాలనీ, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరూ 5న తహసిల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇరపా అజరు, కాక అర్జున్‌ దొర, సవలం రాము, ముర్రం వెంకటేష్‌, సవలం ముత్తయ్య పాల్గొన్నారు.