Aug 18,2022 20:55

స్వాధీనం చేసుకున్న ఫోన్లను పరిశీలిస్తున్న ఎస్‌పి దీపిక

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో పోయిన మొబైళ్లను ట్రేస్‌ చేసేందుకు గత నెలలో ఎస్‌పి దీపిక పాటిల్‌ ప్రారంభించిన వాట్సాప్‌ ఫిర్యాదుల నంబరు సత్ఫలితాలనిస్తోంది. 89779 45606 నంబరుకు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకున్న సైబర్‌ సెల్‌ పోలీసులు, వాటిని ట్రేస్‌ చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. నెల వ్యవధిలోనే 103 మొబైళ్లను రికవరీ చేసినట్లుగా ఎస్‌పి ఎం.దీపిక వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎస్‌పి మాట్లాడుతూ పోయిన మొబైళ్లను ఇతర జిల్లాలు, ఒడిశా, చత్తీస్‌గడ్‌, కేరళ, బీహార్‌, జార్ఖండ్‌, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న వినియోగిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. సైబరు సెల్‌ పోలీసులు మొబైల్స్‌ వినియోగిస్తున్న వారితో మాట్లాడి, ఆయా ప్రాంతాల నుంచి వాటిని రికవరీ చేశామన్నారు. సుమారు రూ.16.45 లక్షల విలువైన 103 మొబైళ్లను వివిధ ప్రాంతాల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాట్సాప్‌ నంబరుకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొబైళ్లను తిరిగి ఫిర్యాదుదారులకు ఎస్‌పి అందజేసారు. ఈ మొబైళ్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులు ఎం.ప్రశాంత్‌ కుమార్‌, నీలావతి, బి.వాసుదేవరావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్‌.రాజేష్‌ను ఎస్‌పి అభినందించారు.
పోయిన మొబైళ్ల ఫిర్యాదులకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌
పోయిన మొబైళ్ల గురించి మరింత సులువుగా ఫిర్యాదు చేసేందుకు దువ్వాడలోని విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ వుమన్‌ కళాశాల ఐటి విభాగానికి చెందిన విద్యార్థులు రూపొందించిన వెబ్‌ పోర్టల్‌ ఙఓఎఎశీbఱశ్రీవ్‌తీaషసవతీ.ఱఅను ఎస్‌పి ప్రారంభించారు. ప్రజలు మరింత సులువుగా పోయిన మొబైళ్ల గురించి ఫిర్యాదు చేసేందుకు, వారి ఫిర్యాదుల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకొనే వెసులుబాటును ప్రజలకు ఈ వెబ్‌పోర్టల్‌ ద్వారా కల్పించామని తెలిపారు. ఈ తరహా వెబ్‌ పోర్టల్‌ను రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లా పోలీసులు ప్రారంభించారని వెల్లడించారు. పోయిన మొబైల్స్‌ గురించి వెబ్‌పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెబ్‌ పోర్టలను రూపొందించిన విద్యార్థులు అడారి దీపిక, జామి చాందిని, పాలడుగుల ఉమా శ్రీరమ్య, ఉప్పల లిఖిత, అసిస్టెంట్‌ ప్రొఫెసరు నేతాజీ గండిలను ఎస్‌పి అభినందించారు సమావేశంలో ఇన్‌ఛార్జి డిఎస్‌పి టి.త్రినాథ్‌, ఎస్‌బి సిఐ జి.రాంబాబు, సిహెచ్‌.రుద్రశేఖర్‌, సిఐలు బి.వెంకటరావు, సిహెచ్‌.లక్ష్మణరావు, టి.వి.తిరుపతిరావు, ఎస్‌ఐలు ప్రశాంత్‌కుమార్‌, నీలావతి పాల్గొన్నారు.