Apr 20,2021 22:10
బాధితులతో మాట్లాడుతున్న కె.రామకృష్ణ

ప్రజాశక్తి-వినుకొండ (గుంటూరు) : పోలవరం ప్రాజెక్టు బడ్జెట్‌ అంచనాల పెంపు పెద్ద మోసమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రూ.795 కోట్ల వ్యయం తగ్గిందని చెప్పి ఇప్పుడు రూ.3 వేల కోట్లకు బడ్జెట్‌ అంచనాలు పెంచడంపై ఇరిగేషన్‌ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా వినుకొండలోని అజాద్‌ నగర్‌, మసీద్‌ మాన్యం కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మసీదు మాన్యం భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పజెప్పే కుట్రతో ఐదు వేల కుటుంబాలను ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు ఇబ్బంది పెడుతున్నారన్నారు. నెల రోజులుగా విద్యుత్‌, నీటి సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురుచేస్తున్నారన్నారు. విద్యుత్‌, నీటి సరఫరాపై కలెక్టర్‌ ఆదేశాలిచ్చినా మున్సిపల్‌ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాస్తామని, అయినా స్పందించకుంటే సిఎం వద్దకే బాధితులతో కలిసి పాదయాత్రగా వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, జిల్లా నాయకులు పాల్గన్నారు.