May 18,2022 09:37

ప్రజాశక్తి- రాజవొమ్మంగి : పోలవరం నిర్వాసిత గ్రామాల్లో సమస్యలపై జూన్‌ ఐదో తేదీ నుంచి 20వ తేదీ వరకూ పాదయాత్రలు, ఆందోళనలు, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించకుండా మాయమాటలు చెప్తూ ముంపు గ్రామాలకు వస్తోన్న బిజెపి, వైసిపి నాయకులను ప్రజలు ఎక్కడికక్కడే నిలదీయాలని పిలుపునిచ్చారు. సిపిఎం రంపచోడవరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. రంపచోడవరంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఆయన హాజరయ్యారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రంపచోడవరం నియోజకవర్గంలోని ఐదు ముంపు మండలాల ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కష్టాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని అన్నారు. నిర్వాసిత కాలనీలు సరిగాలేవని, కనీస సౌకర్యాలు కరువవ య్యారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల దేవీపట్నం మండలంలోని అనేక గ్రామాలు మునిగి పోతాయని తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని వైసిపి, టిడిపి నిలదీయడం లేదని తెలిపారు. బిజెపి కపట నాటకాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. పునరావాసానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
 

                                                    'ఉపాధి' నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. దీనిలో భాగంగా రెండు పూటల పని విధానాన్ని అమలు జరుపుతోందన్నారు. గిరిజన ప్రాంతంలో కూలీలు ఒక పూట పొలం పనులు చేసుకుంటూ మరొక పూట ఉపాధి పనులకు వెళ్తుంటారని తెలిపారు. వీరికి ఉపాధి పనులు ఎంతో ఆసరాగా ఉండేవని, ఇప్పుడు రెండు పూటలా ఉపాధి విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో 200 రోజులు పని దినాలు కల్పించాలని, ఒక పూట మాత్రమే ఉపాధి పనులు పెట్టాలని, కనీస వేతనం అమలు చేయాలని, పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలూ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, రంపచోడవరం జిల్లా నాయకులు బి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.