May 03,2021 21:34

శ్రీరామ్మూర్తి మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య శ్రీదేవి

పార్వతీపురం: పీడిత ప్రజల గొంతు మూగబోయింది... నిరంతరం కార్మిక, కర్షక, గిరిజన, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే ఉద్యమ జ్వాల నింగికెగిసింది. ఉద్యమ కిరణం కరోనా రక్కసికి బలైపోయింది. అన్యాయాలను ఎదిరించి పోరాటమే ఊపిరిగా నమ్మిన సిద్ధాంతం కోసం 33 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడిన అరుణతార అస్తమయమైంది. నిత్యం పేదల అభ్యున్నతికి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ పేద, బడుగు, బలహీన వర్గాలకు భరోసా ఇస్తూ వెన్నుచూపని పోరుసల్పిన ఉద్యమశిఖరం నేలకొరిగింది. పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో గిరిజన, దళిత, రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా అందరి సమస్యలపై ముందుండి పోరాడిన సిపిఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి.. అకాల మరణం పొందారు. కరోనా మహమ్మారి తొలివిడత విజృంభించిన నేపథ్యంలో గతేడాది పేదలకు నిత్యావసర వస్తువులు అందించి వారికి అండగా ఉంటూ కొండంత భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ సోమవారం అమరులయ్యారు.
ప్రజా ఉద్యమకారుడు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్వతీపురం ప్రాంత కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి (57) సోమవారం ఉదయం మృతిచెందారు. 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో వారం రోజులపాటు చికిత్స పొందిన ఆయన తరచూ ఆక్సిజన్‌ సమస్య రావడంతో నాలుగు రోజుల క్రితం ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి పోరాడుతూ సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మతి చెందారు. విషయం తెలుసుకున్న వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉద్యమ శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టివి రమణ, రెడ్డి శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు జి.శ్రీనివాస్‌, సురేష్‌, యుటిఎఫ్‌ నాయకులు డి.రాము, నిర్మల, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌, సిఐటియు అధ్యక్షులు జి.అప్పలసూరి తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. శ్రీరామ్మూర్తి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో ఆయన స్వగ్రామం రెడ్డివానివలస తీసుకువెళ్లారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతదేహంపై సిపిఎం జెండాను కప్పి నాయకులంతా నివాళులర్పించారు. పార్వతీపురం జిల్లా కార్యదర్శిసభ్యులు రెడ్డి వేణు, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌వై నాయుడు, సన్యాసిరావు, పి.శంకరరావు, సాంబమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌, సిఐటియు కార్యదర్శి బి.వి.రమణ, శ్రామిక మహిళా సంఘం నాయకులు బి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈశ్వరరావు, రమణమూర్తి, పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని భౌతికకాయం వద్ద నివాళ్లు అర్పించారు.
కుటుంబ నేపథ్యం
శ్రీరామ్మూర్తి 1963లో సీతానగరం మండలం రెడ్డి వానివలస రెడ్డి అప్పలనాయుడు, పారమ్మ దంపతులకు జన్మించారు. మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన శ్రీరామ్మూర్తి ఇంటర్మీడియట్‌ వరకు విద్యనభ్యసించారు. ఒకటోతరగతి నుంచి ఐదో తరగతి వరకు రెడ్డివాని వలసలోనూ, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బొబ్బిలి సంస్థానం హైస్కూల్‌, ఇంటర్మీడియట్‌ బొబ్బిలి రాజా కళాశాలలో చదివారు. 1986 -87లో ఆయన డివైఎఫ్‌ఐలో చేరి యువజన, విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. 1988లో సిపిఎంలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన ఉడుముల శ్రీదేవిని 1989లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆమె ఐద్వా (పార్వతీపురం) జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు ఉదరు, కిరణ్‌ కుమారులు ఉన్నారు. ఉదరుకు ఇటీవలే వివాహమైంది. కిరణ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.
నేనున్నానంటూ..
శ్రీరామ్మూర్తి 1992 నుంచి పార్వతీపురం కేంద్రంగా సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం తరపున పనిచేసి ఉద్యమాన్ని విస్తత పరచారు. 1995లో లచ్చయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీ రైతుల సమస్యలపై పోరాటాన్ని ప్రారంభించారు. చెరకు రైతుల పోరాటానికి అండగా నిలిచి వారి సమస్య పరిష్కరించే వరకు యాజమాన్యంపై ఒత్తిడి తేవడంలో శ్రీరామ్మూర్తిది కీలకపాత్ర. 2005-06లో తోటపల్లి నిర్వాసితుల సమస్యలపై జరిగిన పోరాటంలో కీలకపాత్ర వహించారు. వందలాది పోరాటాలు చేసి కార్మికుల, పేదల, బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీరామ్మూర్తి. ఫలానా సమస్య ఉందని ఆయన వద్దకు వెళ్తే నేనున్నానంటూ వారి తరపున పోరాటం చేసి పరిష్కారం జరిగే దిశగా అధికారులతో గాని, నాయకులతో గాని గళం విప్పి గర్జించేవారు. అటువంటి ఆయన నేడు కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందడం బాధాకరం. శ్రీరామ్మూర్తి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.. సిపిఎం జిల్లా విభజన జరిగిన నేపథ్యంలో 2018 నుంచి నేటి వరకూ పార్వతీపురం జిల్లా కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థి, గిరిజన, తోటపల్లి, బడిదేవరకొండ, బోడికొండ.. ఇలా అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర వహించి పరిష్కారమయ్యేంత వరకు పోరాటాలను ముందుండి నడిపారు.
పలువురు సంతాపం
శ్రీరామ్మూర్తి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, పేదలు ఆయన మరణంతో మరింత అభాగ్యులుగా మారారని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జిల్లా ఒక పోరాటయోధున్ని కోల్పోయిందని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అభివర్ణించారు. అలాంటి ప్రజల మనిషిని మళ్లీ చూడలేమని, అయనలేని లోటు గిరిజన, దళిత వర్గాలకు పూడ్చలేనిదని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పేర్కొన్నారు. ఆయన మరణ వార్త విన్న రచయితలు, సాహితీవేత్తలు, కవులు కళాకారులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని శోకసంద్రమయ్యారు. ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీష్‌, పక్కిరవీంధ్రనాద్‌, చింతా అప్పలనాయుడు, శిరికి స్వామినాయుడు, నారంశెట్టి ఉమామహేశ్వరావు, బెలగాం భీమేశ్వరరావు, సాహితీ లహరి వ్యవస్థాపకులు మంచిపల్లి శ్రీరాములు, రెడ్డి శ్రీరామ్మూర్తితో ప్రజా పోరాటాలే ఊపిరిగా జీవించిన ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఒక యోధుని శకం ముగిసిపోయిందని, ఉద్యమ స్వర ఆగిపోయిందని సంతాపం తెలిపారు. ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ప్రతినిధి సాయిప్రతాప్‌, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సామల సింహాచలం, అమరాపు సూర్యనారాయణ తదితరులు పేదలగొంతు మూగపోయిదంటూ వాపోయారు.
ఎఐఐఇఎ సంతాపం
శ్రీరామ్మూర్తి మృతికి ఎఐఐఇఎ పూర్వ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, సిపిఎం జిల్లా కమిటీకి సానుభూతి ప్రకటించారు.
విజయనగరంటౌన్‌ : శ్రీరామ్మూర్తి మృతికి సామాజిక హక్కుల పోరాట వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాకోటి గోపాలరావు, గౌరవాధ్యక్షులు కొమ్ము సోములు, అధ్యక్షులు మండంగి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు మైలపల్లి అప్పారావు సంతాపం ప్రకటించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సంతాపం
రెడ్డి శ్రీరామ్మూర్తి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎంఎస్‌ వాసా సంతాపం తెలిపారు. ఆయన మరణం ఉత్తరాంధ్రకు, ప్రజాతంత్ర ఉద్యమానికి ప్రత్యేక పార్వతీపురం ప్రాంతానికి తీరని నష్టమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రజాశక్తి సంతాపం
సిపిఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మృతి పట్ల ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు (గణేష్‌), విజయనగరం జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌ కె.రమేష్‌నాయుడు, సభ్యులు తీవ్ర సంతాపం తెలిపారు. పార్వతీపురం డివిజన్‌లో ప్రజాశక్తి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మరణం ప్రజాశక్తికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా కమిటీ సంతాపం
రెడ్డి శ్రీరామ్మూర్తి మరణం పార్టీకి తీరని లోటని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ సంతాపం తెలిపారు. సమరశీల పోరాట యోధుడ్ని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయనకు అరుణాంజలి ఘటిస్తూ కుటుంబానికి విజయనగరం సిపిఎం జిల్లా కమిటీ సానుభూతిని తెలిపిందన్నారు.
గుమ్మలక్ష్మీపురం : ఎర్ర జెండా ముద్దు బిడ్డ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఉద్యమకారుడు శ్రీరామ్మూర్తి మరణం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌, జిల్లా నాయకులు మండంగి రమణ, సిఐటియు మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, ఎపి గిరిజన సంఘం మండల కార్యదర్శి బిడ్డిక శంకరరావు, కుక్కిడ సర్పంచి బిడ్డిక రాజారావు, మాజీ సర్పంచ్‌ బిడ్డిక చామంతి విచారం వ్యక్తంచేశారు.
మెంటాడ : రెడ్డి శ్రీరామ్మూర్తి మృతికి కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఐద్వా రాష్ట్ర నాయకులు రాకోటి హరికృష్ణవేణి, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.సోములు సంతాపం తెలిపారు.

కొత్తవలస : శ్రీరామ్మూర్తి మరణం పార్టీకి తీరని లోటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు విచారం వ్యక్తంచేశారు. మండలంలోని దేవాడలో పెద్ద చెరువులో ఉపాధి కూలీలతో సంతాప సభ నిర్వహించి మౌనం పాటించారు. శ్రీరామ్మూర్తి మృతికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర నాయకులు గుడివాడ పైడిరాజు, సిపిఎం జిల్లా నాయకులు డేగల అప్పలరాజు సంతాపం తెలిపారు.

బొబ్బిలి : రెడ్డి శ్రీరామ్మూర్తి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు పి.శంకరరావు, ఎస్‌.గోపాలం, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఐద్వా నాయకులు బి.యుగంధర్‌, ఎస్‌.సరస్వతి, యుటిఎఫ్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కె.రామకృష్ణ, ఆదినారాయణ పేర్కొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మృతికి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన సంతాపం ప్రకటించారు.
రెడ్డి శ్రీరామ్మూర్తి మరణం వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, బొబ్బిలి నియోజకవర్గ కార్యదర్శి కె.ప్రసాదరావు, మండల, పట్టణ కార్యదర్శులు కోట అప్పన్న, ఎం.శ్రీనివాస్‌ విచారణ వ్యక్తంచేశారు.మూగబోయిన పార్వతీపురం
శ్రీరామ్మూర్తి మృతికి పట్టణ ప్రజల ఘన నివాళి
సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తికి సంతాపాన్ని పాటిస్తూ సోమవారం పట్టణంలోని నాలుగురోడ్డ కూడలిలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యాన ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్ని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం శ్రీరామ్మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో అనేక ఉద్యమాలు నిర్వహించారని, అలాంటి వ్యక్తి మరణం పార్వతీపురం పట్టణానికే కాకుండా ఈ ప్రాంతానికి తీవ్రమైన లోటని అన్నారు.
శ్రీరామ్మూర్తి మరణంతో పార్వతీపురం ప్రాంతం శోకంలో మునిగిపోయింది. మున్సిపల్‌ కార్మికులు, కళాసీలు, చిల్లర వర్తకులు తమ కార్యకలాపాలను స్వచ్ఛందంగా రద్దు చేసుకొని సంతాప ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గొర్లి వెంకట రమణ, బివి రమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు, సంచాన ఉమామహేశ్వరరావు పట్టణంలోని నాలుగు రోడ్ల సెంటర్లో రెడ్డి శ్రీరామ్మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండపల్లి బాలకృష్ఞ, మంతిన రవికుమార్‌, పల్లి భానుప్రకాష్‌, ప్రజాసంఘాల నాయకులు వరదరాజు, శంకరరావు, శివ, కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.