Mar 25,2023 00:12

మాట్లాడుతున్న తహశీల్దార్‌ గిరిబాబు

ప్రజాశక్తి - టెక్కలి రూరల్‌: తమ జీవనాధారమైన భూములను భావనపాడు పోర్టు రోడ్డు కోసం ఇవ్వలేమని టెక్కలి పంచాయతీ పిఠాపురం, కూర్మనాథపురం రైతులు తేల్చిచెప్పారు. టెక్కలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ జి.సుజాత అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ బెండి గిరిబాబు మాట్లాడుతూ భావనపాడు పోర్టు నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య చాలావరకు తీరుతుందన్నారు. పోర్టుకు అవసరమైన రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులకు మెరుగైన పరిహారం ప్రభుత్వం ఇస్తుందని, అభివృద్ధికి సహకరించాలని రైతులను కోరారు. ఆ భూములే తమ జీవనాధారమణి, వాటిని ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. పరిహారం ప్రతిపాదనలను తిరస్కరించారు. మదనగోపాల సాగరం దిగువున ఉన్న భూములు ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయని, అటువంటి భూములను వదులుకుంటే బతుకుదెరువు కోల్పోతామని చెప్పారు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. సమావేశంలో రైతులు బుడుమూరు చంద్రశేఖర్‌, పట్నాన ఢిలేశ్వరరావు, బొడ్డేపల్లి వజ్రం, పి.చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.