Mar 19,2023 01:09
బీమా చెక్కు అందజేస్తున్న పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ సిబ్బంది

ప్రజాశక్తి-వేటపాలెం: గత 160 సంవత్సరాలుగా ప్రజలకు విరివిగా సేవలందిస్తున్న మన పోస్టాఫీసులో 'జీవిత బీమా' సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకొని వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించాలని చీరాల సబ్‌ డివిజన్‌ పోస్టల్‌ ఎఎస్‌పి ఐ శివరామకృష్ణ, వేటపాలెం సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ ఎల్‌ శ్రీనివాసరావు, రావురిపేట సబ్‌ పోస్టుమాస్టర్‌ పి గోపికృష్ణ, పందిళ్లపల్లి సబ్‌ పోస్టుమాస్టర్‌ ఎన్‌ గంగాధర్‌రావు శనివారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా చీరాల ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ డెంగ్యూ వ్యాధితో మరణించిన పోకూరి రవి కుటుంబానికి పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా కేవలం రూ.2,79,000/- కట్టగా వారికి చేకూరిన లబ్ధి మేరకు రూ.11,68,000/- చెక్కును వారి సతీమణి పోకూరి శిరీషకు అందజేశారు. ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్‌ పొందవచ్చని తెలిపారు. చాలా తక్కువ కాలవ్యవధి ప్రీమియం చెల్లించినప్పటికీ ఎక్కువ మొత్తంలో వారికి లబ్ధి చేకూరినందుకు గాను పోకూరి శిరీష పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ప్రజలందరూ 24-03-2023 నాడు గ్రామీణ తపాలా బీమా దినోత్సవం పురస్కరించుకుని పోస్టాఫీసు ఇన్సూరెన్స్‌ ఉపయోగించుకోవాలని ఐ శివరామకృష్ణ కోరారు.