
ప్రజాశక్తి -కశింకోట
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించాలని, ఇందుకు ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం జరిగిన కశింకోట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ముందే ప్రజాప్రతినిధులు సమస్యను గుర్తించాలని, వాటి పరిష్కారానికి వారే చొరవ తీసుకోవాలని సూచించారు. సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రోడ్లు, మురికి కాలువల సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే నిధుల కింద రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కలగా లక్ష్మి, జడ్పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు, వైస్ ఎంపిపి నమ్మి మీనా, పెంటకోట జ్యోతి, సర్పంచ్ కలగా గున్నయ్యనాయుడు పాల్గొన్నారు.