
ప్రజాశక్తి- అనకాపల్లి : నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలపై ప్రయోగాలు సరికాదని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి అన్నారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో చిన్నబ్బాయి మాట్లాడారు.ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను విడగొట్టి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల డ్రాపౌట్ వంటి దుష్ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రాథమిక విద్య కనుమరుగు, వేలాది ఎస్జిటి పోస్టులు ఖాళీ పోస్టులుగా మిగిలిపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి నూతన విద్యా విధానంలో మార్పులు తేవాలన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు సుబ్బారావు, అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి, ఉపాధ్యక్షులు గాయత్రి, పొలిమేర చంద్రరావు, కోశాధికారి జోగ రాజేష్, ఆడిట్ కన్వీనర్ వెంకటరావు, జిల్లా కార్యదర్శులు దొగ్గా శ్రీను, జిఎస్ ప్రకాష్, వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.