Sep 15,2021 21:56

పరామర్శించడమే నేరమా : సిపియం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌:
స్థానిక ఎమ్మెల్యే నవాజ్‌ బాష వైఖరి, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ వేధింపులకు ఆత్మహత్య చేసుకుని మరణించిన లారీ ఓనరు, డ్రైవర్‌ వెంకటాచలపతి కుటుంబాన్ని పరామర్శించడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే పోలీసులను ఉసిగొల్పి అరెస్టు చేసి, ఫోన్లు లాక్కుని తనను తొమ్మిది గంటల పాటు నిర్భందించడాన్ని ఖండిస్తూ రక్షణ కల్పించాలని మదనపల్లె రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌కు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ లారీ దొంగతనం జరిగిందని పోలీసులను వేడుకున్న బాధితుడు చలపతికి అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే, పోలీసులు బాధితుడిని బెదిరించి ఏడు లక్షలు కట్టాలని, లేకుంటే నీపై కేసు పెట్టి జైల్‌లో వేస్తామని బెదిరించడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై డిఎస్‌పి విచారణ జరిపి కారకులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అలాగే చలపతి మృతికి కారణమైన లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే నవాజ్‌ బాష పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని కోరారు. నాయకులు టి.హరీంద్రనాథ్‌శర్మ, డి.ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌.చంద్ర, ఆర్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.