Jan 17,2022 20:58

జెనీవా : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు, కీలకమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రపంచ నేతలకు దావోస్‌ సమావేశం ఒక అవకాశానిు కల్పిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎప్‌) తెలిపింది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశాలు సోమవారం ఆరంభమయ్యాయి. కీలకమైన అంతర్జాతీయ భాగస్వాములు సంఘటిత కృషి చేపట్టే దిశగా ఈ సమావేశం దృష్టి కేంద్రీకరించనుందని డబ్ల్యుఇఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లుగా నెలకొను కోవిడ్‌ మహమ్మారి, నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఇంధన పరివర్తన, వాతావరణ సంక్షోభం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక దృక్పథం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వాతావరణ మార్పులు, అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్లు అందేలా చూడడం వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కోవిడ్‌ మహమ్మారి, దాని తాలుకూ పర్యవసానాలు, వాటి కారణంగా తలెత్తిన సంక్షోభం అంతా నెమ్మదిగా ఈ ఏడాది తగ్గుముఖం పడుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారని డబ్ల్యుఇఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లాస్‌ షావాబ్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు నుండి విశ్వాస పునరుద్ధరణ చర్యల వరకు పలు ప్రధానమైన అంతర్జాతీయ సవాళ్లు మనముందున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించాలంటే, నేతలందరూ కొత్త నమూనాలను ఆమోదించి, అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరించాలని, సహకారాన్ని పునరుద్ధరించుకుని, వ్యవస్థాగతంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి : జిన్‌పింగ్‌
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కొనాలి, కోవిడ్‌ అనంతర ప్రపంచాన్ని ఎలా నిర్మించాలనే ప్రధాన, అత్యవసర ప్రశ్నలకు ఈ సమావేశాల్లో సమాధానాలు దొరకాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలివేనని అన్నారు. డబ్ల్యుఇఎఫ్‌ సమావేశాల్లో జిన్‌పింగ్‌ ప్రసంగించారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనిరీతిలో ఈనాడు ప్రపంచం ప్రధాన మార్పులకు లోనవుతోందని అన్నారు. ఈ మార్పులనేవి కేవలం ఒక దేశానికి, లేదా ప్రాంతానికి, నిర్దిష్ట కాలానికి పరిమితం కాలేదని, అంతర్జాతీయంగా పెనుమార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. శతాబ్ద కాలంలో ఒకసారి ఇటువంటి పెనుమార్పులు సంభవించినపుడు ఈ కల్లోలిత, పరివర్తనా కాలంలో ప్రపంచం తనను తాను కనుగొంటుందని అన్నారు.