Jan 14,2022 20:12

- భోగి మంటల్లో నీతి అయోగ్‌ సిఫార్సు, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జిఒ కాపీలు దహనం
ప్రజాశక్తి- కలెక్టరేట్‌/ ఉక్కు నగరం (విశాఖ) :ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నీతి అయోగ్‌ సిఫార్సు కాపీలను, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఇచ్చిన జిఒ కాపీలను సిఐటియు ఆధ్వర్యంలో భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ.. దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వం, నీతి అయోగ్‌ విధానాలను భోగి మంటలలో తగలబెడుతున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను, ప్రజా సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా బిజెపి ప్రభుత్వం కట్టబెడుతుందన్నారు. ఢిల్లీ రైతుల పోరాట స్ఫూర్తితో స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం, నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న మోడీ ప్రభుత్వాన్ని దేశ వ్యాప్తంగా ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి పి.మణి, నాయకులు బి.వెంకటరావు, ఒమ్మి అప్పారావు, వై.రాజు, డి.అప్పలరాజు, కె.పెంటారావు, వి.కృష్ణారావు పాల్గన్నారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతాం
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు
గ్రామ స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 337వ రోజుకు చేరాయి. శుక్రవారం నాటి దీక్షల్లో ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్‌-2 కార్మికులు పాల్గన్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు ఎన్‌.రామారావు, డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళడంలో భాగంగా అనేక జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ కార్మికవర్గం మొక్కవోని దీక్షతో పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. దీక్షా శిబిరంలో ఎస్‌ఎమ్‌ఎస్‌-2 ప్రతినిధులు పివి.రమణమూర్తి, మరిడయ్య, సుధీర్‌, జగదీష్‌, రామరాజు, పి.అప్పలరెడ్డి కార్మికులు పాల్గొన్నారు.