
ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాల పరిశీలనలో భాగంగా, జిల్లా కలెక్టర్ మొదట పంగులూరు సచివాలయం-1ని పరిశీలిం చారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, రికార్డులు పరిశీలించారు. సచివాలయంలో సిబ్బంది ఎక్కువమంది సెలవుల్లో వెళ్లటంపై ఆయన ఆరా తీశారు. కంప్యూటర్‌ను పరిశీలించారు. ఆధార్ సెంటర్‌ను కూడా పరిశీలించారు. ఎక్కువమంది అక్కడ నిలబడి ఉండటంతో ఎందుకు ఉన్నారని అడిగాడు. కొత్త జిల్లా అయినందువలన ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకుంటున్నామని చెప్పారు. అనంతరం రైతు భరోసా కేంద్రం-1కి వచ్చి రికార్డులను పరిశీలించారు. మీటింగుల రిజిస్టర్‌ను పరిశీలించి, అందులో సంతకాలు ఏవని, మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డిని, ఏఏఓను ప్రశ్నించారు. ఆర్‌బికే పరిధిలో ఎరువులు ఎన్ని వస్తున్నాయి? ఎన్ని అమ్మారు? ఎన్ని మిగిలాయి? గోడౌన్ ఎక్కడీ అని ప్రశ్నించారు. తరువాత తహశీల్దారు కార్యాలయం చేరి, తహశీల్దారు కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. మండల సర్వేయర్ వినోద్‌ను పిలిచి సర్వే రిపోర్ట్ తీసుకురమ్మని అడిగారు. తహశీల్దారు కార్యాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు పద్మావతి, ఎంపీడీవో రమణమూర్తి, ఆర్‌ఐ రామకృష్ణ, తహశీల్దారు కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.