Jul 29,2021 21:26

చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్‌   :  ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆకాంక్షించారు. జగనన్న విద్యాదీవెన పథకం రెండో విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ కలెక్టర్‌లతో మాట్లాడారు. విద్యారంగానికి పెద్దపీట వేశామని, అందుకే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గత ఏడాది ఈ పథకం జిల్లాలో కింద మొదటి విడతలో 79,844 మంది లబ్ధిపొందినట్లు తెలిపారు. రూ.52 కోట్లను తల్లుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రెండో విడత కింద 80,509 మంది విద్యార్థులు లబ్ధి పొందడం అభినందనీయమన్నారు. 12,013 మంది తల్లుల ఖాతాలకు రూ.54.01 కోట్ల నగదు నేరుగా జమ అవుతోందన్నారు. ఇందులో ఎస్‌సి,ఎస్‌టి, బిసి, ఇబిసి, ముస్లిం మైనార్టీ, కాపు, క్రిస్టియన్‌ మైనార్టీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మూడునెలలకోసారి విడతల వారీగా నగదు విడుదల కానుందని చెప్పారు. ఇంటర్మీడియట్‌, ఐటిఐ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు భారం లేకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా సంయుక్త కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.కృష్ణవేణి, సాంఘిక సంక్షేమశాఖ డిడి లక్ష్మానాయక్‌, బిసి సంక్షేమశాఖ అధికారి అంజల, గిరిజన సంక్షేమశాఖ అధికారి లలితాబాయి, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఝాన్సీరాణి, నగరపాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, వైసిపి నాయకులు క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.