Jun 11,2021 00:36

నినాదాలు చేస్తున్న సిఐటియు నాయకులు

కలెక్టరేట్‌ : ప్రజల సంపద అయిన స్టీల్‌ ప్లాంట్‌, పోర్టు, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, షిప్‌ యార్డ్‌, రక్షణ రంగం, బిహెచ్‌ఇఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 70వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ సంపదను అమ్మకానికి పెట్టిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో లక్ష మందికి ఉద్యోగాలు కలిగిస్తున్న ప్రభుత్వ రంగం లేకపోతే రాష్ట్ర రాజధాని ఇక్కడ పెడతామనే చర్చ కూడా జరగదన్నారు. కరోనాని ఉద్దేశ్యపూర్వకంగానే మోడీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని విమర్శించారు. ప్రజలు కరోనాతో భయపడుతున్న సమయంలో దేశ సంపదను అమ్మేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి వినాశకర విధానాలు అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఎస్‌.జ్యోతీశ్వరరావు, కుమార మంగళం, డి.అప్పలరాజు, ఎం.సుబ్బారావు, కెవిపి చంద్రమౌళి, కె.కుమారి, రైతు సంఘ నాయకులు గండి నాయనబాబు పాల్గొన్నారు.