Jun 11,2021 21:20

ప్రజాశక్తి - నందిగామ : ప్రాధమిక విద్యావ్యవస్థకు నష్టం కలిగించే ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ప్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. నందిగామలోని తహశీల్దార్‌, ఉప విద్యా శాఖ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నందిగామ డిప్యూటీ తహశీల్దార్‌ రిబ్కారాణికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ మహేశ్వర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలిమెంటరీ స్కూల్‌ వ్యవస్థను ముక్కలు చేయకుండా కొనసాగించాలని కోరారు. ఎలిమెంటరీ స్కూళ్లను పౌండేషన్‌ స్కూళ్లుగా మార్పు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యావ్యవస్థలోకి ఫ్రీప్రైమరీ వ్యవస్థను తీసుకురావటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు నందిగామ మండల అధ్యక్షులు కే వంశీకష్ణ యుటిఎఫ్‌ చందర్లపాడు మండల అధ్యక్షులు టి గంగరాజు, వెంకటాద్రి, ఎస్‌టియు నందిగామ మండల నాయకులు చింత నరసింహారావు, యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిలర్‌ పిఎస్‌ హరినాధ్‌ రెడ్డి, బి.రమణయ్య, హెచ్‌ఎం అసోసియేషన్‌ అధ్యక్షుడు జి పాల్‌ కెనడీ తదితరులు పాల్గొన్నారు.