Oct 28,2021 02:09

విశాఖలోని ఎఎస్‌.రాజా జూనియర్‌ కళాశాల

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి, ఎంవిపి.కాలనీ
జిల్లాలో 62 ఎయిడెడ్‌ పాఠశాలలు అన్‌ ఎయిడెడ్‌గా మారినట్లే, ఏడు ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల లెక్చరర్లు, సిబ్బందిని యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించాయి. దీంతో ప్రయివేటు కాలేజీల మాదిరిగానే ఈ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి తరగతులు నిర్వహిస్తున్నాయి. పేద విద్యార్థులకు పెద్ద దిక్కుగా వున్న ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీ అధ్యాపకులు, సిబ్బందిని అప్పగించడంతో మధ్యంతరంగా కాలేజీలు మానలేక ఫీజులు చెల్లించి విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. అధ్యాపకులు, సిబ్బంది సర్దుబాటు కొద్ది రోజుల్లో జరగనుంది. ఏడు ఎయిడెడ్‌ కాలేజీల్లో ఆరు కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులు, సిబ్బందిని రిలీవ్‌ చేశాయి. హిందూస్థాన్‌ షిప్‌యార్డు జూనియర్‌ కాలేజీ అధ్యాపకులను యాజమాన్యం రిలీవ్‌ చేయకపోవడంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ఇంటర్‌బోర్డ్‌ అధికారులు ఇంకా ప్రారంభించలేదు. ఏడు ఎయిడెడ్‌ కాలేజీల్లోని 31 మంది అధ్యాపకులు, 21 మంది సిబ్బందిని ప్రభుత్వం నుంచి షెడ్యూల్‌ వచ్చిన తరువాత ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు ప్రజాశక్తికి తెలిపారు.
అధ్యాపకులను ప్రభుత్వానికి అప్పగించిన ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల నుంచి ఫీజులు పెంచి యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. మరొక కళాశాలకు వెళ్లలేక తప్పని పరిస్థితుల్లో పెంచిన ఫీజు చెల్లించి కొనసాగుతున్నట్లు ఎఎస్‌ రాజా జూనియర్‌ కాలేజీ ఇంటర్‌ విద్యార్ధి షేక్‌ హసీనా ప్రజాశక్తికి చెప్పింది. ప్రభుత్వ అధ్యాపకులను ప్రభుత్వానికి అప్పజెప్పి కొత్త వారిని నియమించుకొని తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్‌రాజా జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ నారాయణమూర్తి తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనున్నట్లు ఓ కళాశాల కరస్పాండెంట్‌ తెలిపారు. ఫీజు భారం లేకుండా ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో చదువుకున్న పేద విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం భారంగా మారింది.
ప్రభుత్వానికి అధ్యాపకులు, సిబ్బందిని అప్పగించిన ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో బివికె జూనియర్‌ కాలేజీ(ద్వారకానగర్‌), హిందూస్థాన్‌ షిప్‌యార్డు జూనియర్‌ కాలేజీ(గాంధీగ్రాం), ఎఎస్‌ రాజా జూనియర్‌ కాలేజీ(ఎంవిపికాలనీ), బుల్లయ్య జూనియర్‌ కాలేజీ, ఎంఎవిపి జూనియర్‌ కాలేజీ (గాజువాక), ఎస్‌విఎల్‌ఎన్‌ జూనియర్‌ కాలేజీ(గోపాలపట్నం), సెయింటెన్స్‌ జూనియర్‌ కాలేజీ(మల్కాపురం) వున్నాయి.