Feb 09,2023 00:18

ప్రజాశక్తి-మార్కాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని పాలన సాగిస్తున్నారని, అర్హత కలిగిన ఏ ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరగకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. అందరూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. బుధవారం స్థానిక డ్వాక్రా బజారులో జరిగిన గృహ సారధుల సమావేశంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ బాగుందన్నారు. ఎవరికి ఎలాంటి పథకం వర్తిస్తుందో గుర్తించి ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అర్హత ఉండీ సంక్షేమానికి నోచుకోని వారందరినీ గుర్తించేందుకు వాలంటీర్లతో పాటు గృహ సారథులను కొత్తగా నియమించడం జరిగిందన్నారు. వాలంటీర్లతో కలిసి పనిచేసి మీకు అప్పగించిన గృహాల్లో ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో గుర్తించాలన్నారు. ఆ విధంగా ప్రభుత్వం ద్వారా సాయం అందించేందుకు మనం పనిచేయాలన్నారు. వాలంటీర్లతో పాటు గృహ సారథులు సంయుక్తంగా పనిచేసి జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సిఎం జగన్‌ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు హబిబుల్లా, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీక్రిష్ణ, వైస్‌ చైర్మన్‌లు షేక్‌ ఇస్మాయిల్‌, సిహెచ్‌ అంజమ్మ శ్రీనివాస్‌, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.