Jul 03,2022 22:44

పోలవరం నిర్వాసితుల ఆవేదన
పునరావాస ప్యాకేజీ, యువతకు పరిహారం ఏఒక్కటీ అందని దుస్థితి
పునరావాసానికి రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని అంచనా
పునరావాసం, పరిహారం ఊసు పట్టని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం
2014లో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మరిచిపోయినట్టేనా
నేడు భీమవరం ప్రధాని మోడీ రాక

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా, యువతకు పరిహారం అందించకుండా, పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా మమ్మల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టాలని చూడటం ఏవిధంగా న్యాయమో చెప్పాలి' అంటూ పోలవరం నిర్వాసితులు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు. సోమవారం ప్రధాని భీమవరం పర్యటనకు రానుండటంతో కేంద్రం పరిధిలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. నిధులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలుగా ఉన్నాయి. 41.15 మీటర్ల ఎత్తున కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తవడంతో వేలేరుపాడులో 18 గ్రామాలు, పోలవరంలో 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలో ఎనిమిది గ్రామాలు మొత్తం 45 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 9,942 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ప్రభుత్వం ప్రకటించిన రూ.పది లక్షల ప్యాకేజీగాని, 18 ఏళ్లు నిండిన యువతకు ఇస్తామన్న రూ.6.36 లక్షల పరిహారంగాని, ఇళ్లకు సంబంధించిన పరిహారంగాని ఇవ్వలేదు. ఇటీవల కొద్దిమందికి పునరావాస ప్యాకేజీ రూ.6.86 లక్షలు ఇచ్చి గ్రామాల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో సమాధానం చెప్పరు. గోదావరి వరదల నేపథ్యంలో ప్రతియేటా జులై, ఆగస్టు నెలల్లో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వరదలకు గ్రామాలు మునిగిపోవడంతో కొండలపైకి, పక్కగ్రామాలకు వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ఉంటే వారంతా గ్రామాలను ఖాళీ చేసేవారు. నిర్వాసితులకు ఇవ్వాల్సినవి ఏవీ ఇవ్వకుండా గ్రామాల నుంచి తరిమివేయాలని, నిలువునా ముంచేయాలని చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం పరిధిలోనిది. నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌పై ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వేల కుటుంబాల నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కేంద్రం నిధులిస్తే పునరావాసం చకచకా
పోలవరం ప్రాజెక్టుకు రూ.52 వేల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపింది. దీనిలో రూ.30 వేల కోట్లకుపైగా నిర్వాసితుల పరిహారానికి వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. సాంకేతిక కమిటీ సైతం దీనికి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఎనిమిదేళ్లుగా మోడీనే ప్రధానిగా ఉన్నారు. గత ప్రభుత్వాల హయాంలో, మోడీ సర్కార్‌ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన మొత్తం సొమ్ము రూ.11 వేల కోట్లు వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము ఇంకా రూ.2,500 కోట్లు వరకూ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఇచ్చిన సొమ్ము కాకుండా కేంద్రం ఇంకా రూ.37 వేల కోట్లు ఇస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తికాని పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దీంతో నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. ప్రధాని జిల్లాకు రానుండటంతో పోలవరం నిర్వాసితుల పరిహారంపై స్పష్టత ఇవ్వాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు.
పిఎం సాబ్‌.. కొల్లేరు హామీని మరిచిపోయారా
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాని అభ్యర్థిగా మోడీ భీమవరంలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని మాట్లాడారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని, కొల్లేరుకు పూర్వవైభవం తెస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోతుంది. ఇప్పటి వరకూ కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. 77 వేల ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరులో బెడ్‌, బెల్టు గ్రామాలు మొత్తం 120కిపైగా ఉన్నాయి. ఐదు లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. 2006 ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో చెరువులన్నింటినీ బాంబులు పెట్టి ధ్వంసం చేశారు. అప్పటి నుంచి కొల్లేరు ప్రజలకు సరైన ఉపాధి లేక వలస పక్షుల్లా మారారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తే కొల్లేరుపై ఆధారపడి జీవించే ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరం. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలంటూ అప్పట్లో టిడిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సమస్యను పరిష్కరించలేదు. ప్రధాని భీమవరం వస్తుండటంతో మీరిచ్చిన హామీని అమలు చేయాలంటూ కొల్లేరు ప్రజలు కోరుతున్నారు.
పరిహారం ఇవ్వకపోతే ఎలా బతకాలి
కూనారపు వెంకన్న, నిర్వాసితుడు, గొమ్ముగూడెం

రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్నారు. పరిహారం ఇవ్వకుండా పంపిస్తే మేమంతా ఎలా బతకాలి. పరిహారం తర్వాత ఇస్తామని చెప్పడం ఏమాత్రం న్యాయం కాదు. గోదావరి వరదలు రావడంతో ఇళ్లు పడిపోవడం, బాగు చేసుకోవడం ప్రతియేటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. పరిహారం ఇచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాలి.
అన్ని సౌకర్యాలూ కల్పించి ఉపాధి చూపించాలి
సున్నం వెంకటేశ్వర్లు, భోనగిరి, కుక్కునూరు మండలం

భోనగిరి గ్రామంలో 92 గిరిజన కుటుంబాలు ఉండగా, ఇప్పటి వరకూ 34 మందికి మాత్రమే పునరావాస ప్యాకేజి ఇచ్చారు. ఇళ్ల పరిహారం ఇవ్వలేదు. మిగిలిన కుటుంబాలకు ఏఒక్కటీ ఇవ్వలేదు. అయితే గ్రామం నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు. గిరిజనులకు అన్ని సౌకర్యాలూ కల్పించి శాశ్వతంగా ఉపాధి కల్పించాలి. అంతేకాకుండా భూమికి భూమి బదులు ముంపు ప్రాంతాల్లో భూములు ఇస్తున్నారు. దీనివల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోనున్నారు.
చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు పరిస్థితి
కొడవాటి మహేశ్వరరావు, కుక్కునూరు ఎ బ్లాక్‌

నాలుగేళ్లుగా అదిగో.. ఇదిగో అనడం మినహా పరిహారం ఇవ్వడం లేదు. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా గ్రామాలను వదిలి పోవాల్సి ఉంటుంది. దీంతో చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్లు నిర్వాసితుల పరిస్థితి తయారైంది. నిర్వాసితులకు పరిహారం ఇచ్చి గ్రామాలను ఖాళీ చేయించాలే తప్ప బలవంతంగా చేయకూడదు.