Jun 10,2021 15:45

పాలక్కడ్‌ : కేరళలో పాలక్కడ్‌ జిల్లాలో ఓ వింత ప్రేమ కథ వెలుగులోకొచ్చింది. పదేళ్ల క్రితం ఓ టీనేజీ అమ్మాయి (18) ఇంటి నుంచి పారిపోయింది. ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి పదేళ్లవుతున్నా.. కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఎక్కడుందో తెలియదు. అయితే తల్లిదండ్రులకు కూడా తెలియని విషయమేమిటంటే.. ఆ అమ్మాయి.. పుట్టింటికి దగ్గర్లోనే మరో ఇంట్లో ఒక్క గదిలోనే పదేళ్లుగా నివాసముంటోంది. ఈ ప్రేమ కథ గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాలక్కడ్‌లో గత పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె నివాసముంటుంది. ఆ గదికి అటాచ్డ్‌ బాత్రూమ్‌ కూడా లేదు. మరి కాలకృత్యాలు ఎలా తీర్చుకునేది.. ఆహారం ఎలా అందేది అన్న సందేహం రాకమానదు. ఆమె రోజూ రాత్రిపూట ఆ గదికి ఉన్న కిటికీ నుంచి బయటకు వెళ్లి.. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి మళ్లీ ఆ కిటికీని మూసివేసేదట. ఇక ఆహారం ఆహారం విషయానికిస్తే.. తనను ప్రేమించిన యువకుడే అన్నీ సమకూర్చేవాడట. అయితే అంతా సవ్యంగా జరిగితే చెప్పుకునేదేముంది. ఇన్ని సౌకర్యాలు చూస్తున్న ప్రేమికుడు కూడా ఓ రోజు ఇంటినుంచి పారిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల విచారణలో అసలు నిజం బయటకుకొచ్చింది. ప్రేమికులిద్దరూ పారిపోయి నెమ్మర సమీపంలోని ఓ కుగ్రామమైన విథాన్‌స్సెరీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నవారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వారిద్దరూ కలిసి జీవించాలని అనుకుంటున్నట్టు తెలపడంతో.. యువతిని ప్రేమికుడితో వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.