May 13,2022 13:49

పాట్నా : ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులు రకరకాల వెర్రి పనులు చేస్తుంటారు. ఆ పనుల వల్ల కొంతమంది ఇబ్బందుల పాలవుతారు. ఇక్కడొక ప్రేమికుడు చేసిన పిచ్చి పనికి ఆ ఊరి ప్రజలంతా ఇబ్బందుల్పుడ్డారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని గణేశ్‌పూర్‌ గ్రామంలోని ప్రజలు తరచూ కరెంట్‌ కోతలతో బాధపడుతున్నారు. ఎప్పుడూ కరెంటు కోతలేరుగని గ్రామస్తులు.. ప్రతిరోజూ కరెంట్‌ పోవడంతో వారెన్నో ఇబ్బందులనెదుర్కొన్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాలకు కరెంట్‌ సమస్యలు లేవు. దీంతో అసలు సమస్య ఎక్కడొస్తుంది? ఎందుకొస్తుంది? ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయాకొచ్చారు. అందులో భాగంగా ఆ ఊరి ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలుపెట్టారు. కరెంట్‌ కోతలకి కారణం ఎలక్ట్రీషియన్‌ అని తెలుసుకుని ఆ ఊరి ప్రజలంతా షాక్‌ తిన్నారు. ఇంతకీ ఆ ఎలక్ట్రిషియన్‌ కరెంటు తీయడానికి గల కారణం ఏమిటంటే... తాను ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు కరెంట్‌ తీసేవాడని తెలుసుకుని గ్రామస్తులు ఖంగుతిన్నారు. ఇక ఆ గ్రామస్తులందరూ ఓ పథకం ప్రకారం ఆ ప్రేమికులిద్దరినీ పట్టుకున్నారు. ఆ ఎలక్ట్రిషియన్‌ని చితక్కొట్టి మరీ ఆ గ్రామంలో ఊరేగించారు. మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా.. ఆ గ్రామస్తులు, సర్పంచ్‌, గ్రామ కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలో వివాహం జరిపించారు. అయితే ఎలక్ట్రిషియన్‌ చేసిన పనికి గ్రామస్తులు ఫిర్యాదు చేయలేదని, చేస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.