Nov 21,2020 06:53

దేశంలో పారిశ్రామిక రంగం పాతాళానికి పరుగులు పెడుతోంది. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామన్న పాలకుల గొప్పలు గాలి బుడగలయ్యాయి. ఇదంతా కరోనా వల్లే అని అనుకోవడానికి లేదు. కరోనా కంటే ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ అమాంతం కుంగిపోయింది. పారిశ్రామిక రంగం అయితే రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. 2019 స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో పారిశ్రామిక రంగ వాటా కేవలం 27.5 శాతం మాత్రమే. పారిశ్రామిక, తయారీ రంగ వాటా గత ఐదేళ్లలో 250 బేసిస్‌ పాయింట్లకు దిగజారిపోయింది. 2014లో జిడిపిలో 30 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగ వాటా గత మూడేళ్ల నుంచి 29.3 శాతానికి పరిమితమైంది. ఆసియా దేశాల జిడిపి లో పారిశ్రామిక రంగ వాటా సగటున 30.8 శాతం ఉండగా ఇప్పడు మన దేశంలో అది ఆ సగటు కంటే కిందకు కుంచించుకుపోవడం గమనార్హం. మేక్‌ ఇన్‌ ఇండియా ఆర్భాటపు నినాదాల మాటున మసకబారిపోతున్న పారిశ్రామిక రంగ దుస్థితికి ఈ గణాంకాలే నిదర్శనం. పాకిస్తాన్‌, నేపాల్‌, మయన్మార్‌ మినహాయిస్తే ఆసియాలో అత్యంత తక్కువ పారిశ్రామిక వృద్ధి నమోదు చేసిన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. ఇంతటి దారుణ స్థితికి కారణం మోడీ సర్కార్‌ వినాశకర విధానాలే అన్నది సుస్పష్టం. ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా కేవలం బడా కార్పొరేట్ల బొక్కసాలు నింపేస్తే చాలునన్న బిజెపి నయ వంచక విధానాల ఫలితమే ఈ పారిశ్రామిక తిరోగమనం.


ఆసియా అభివృద్ధి బ్యాంకు గణాంకాల ప్రకారం..దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి చిన్న దేశాలు సైతం మనకంటే మిన్నగా తమ జిడిపి లో పారిశ్రామిక రంగ వాటాను పెంచుకోగలిగాయి. మనం మాత్రం ఈగలు తోలుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు. ఆటుపోట్లను ఎదుర్కొంటూ అనేక సందర్భాల్లో మన సహాయం అర్థించిన బంగ్లాదేశ్‌ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కంటే మెరుగ్గా తమ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటోంది. 2019 జిడిపి లో పారిశ్రామిక వాటాను 31.2 శాతానికి పెంచుకుంది. సోషలిస్టు కాంతిరేఖలైన చైనా, వియత్నాం వంటి దేశాలు పారిశ్రామిక రంగానికి పట్టం కడుతున్నాయి. చైనా జిడిపి లో ఈ రంగం వాటా 39.2 శాతంగా ఉండగా, వియత్నాం 38.3 శాతానికి పెంచుకుంది.


వాస్తవానికి 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి నుంచి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగం గడిచిన మూడేళ్లలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో శరవేగంగా పతనమైంది. ఐదేళ్లలో మొత్తం తగ్గుదలలో నాలుగింట మూడొంతులు ఈ మూడేళ్ల లోనే పతనమవ్వడం మోడీ సర్కార్‌ విధానాల దుష్ఫలితమేనని తేటతెల్లమవుతోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారులను, అసంఘటిత రంగాన్ని, సహకార రంగాన్ని నష్టాలపాల్జేసిన పెద్ద నోట్ల రద్దు, సరైన ప్రణాళిక లేకుండా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానం తీసుకొచ్చింది ఈ కాలంలోనే. తయారీ రంగం, ఖనిజ తవ్వకాలు, నిర్మాణం, విద్యుదుత్పాదన కలుపుకొని గత మూడేళ్లలో పారిశ్రామిక ఉత్పాదకత కేవలం 17 శాతానికి పరిమితం కావడం నోట్ల రద్దు, జిఎస్‌టి విధానాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఇదే కాలంలో బంగ్లాదేశ్‌లో 48 శాతం, వియత్నాంలో 38 శాతం, చైనాలో 29 శాతం పారిశ్రామిక వృద్ధి నమోదు కావడం గమనిస్తే మోడీ విధానాల వినాశకర స్వభావం బోధపడుతుంది.


స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కూడా దేశంలో నత్త నడక కంటే నెమ్మదించింది. మూడేళ్లలో డాలర్‌ ప్రమాణాల్లో మన దేశ జిడిపి 7.7 శాతం నామమాత్రమపు వృద్ధి నమోదు కాగా, బంగ్లాదేశ్‌ 11 శాతం, చైనా 9.5 శాతం, వియత్నాం 9.3 శాతం నమోదు చేసి మెరుగయ్యాయి. దేశ పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి అథోగతి పాలౌతోందన్న హెచ్చరికలను లెక్క చేయకుండా తానుబట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందాన మోడీ సర్కార్‌ కార్పొరేట్లలో సేవలో తరిస్తుండటం సిగ్గుచేటు. మనది వ్యవసాయక ప్రధాన దేశమే అయినా కూడా ఉద్యోగాలు, ఉపాధి దక్కాలంటే పారిశ్రామిక వృద్ధి తప్ప మరో మార్గం లేదని నిపుణులు సైతం హితవు పలుకుతున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పారిశ్రామిక, తయారీ రంగ వృద్ధి దేశానికి అత్యవసరం. అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ రంగాలు పుష్టిగా ఉంటేనే ప్రజల తలసరి ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి ఒనగూరేది. కొనుగోలు శక్తి పెరిగితేనే సరుకులకు డిమాండ్‌ పెరిగి పారిశ్రామిక, తయారీ రంగం పరుగులు పెడుతుంది. చైనా తదితర దేశాలు మౌలిక రంగానికి విశేష ప్రాధాన్యతను ఇస్తున్నది ఈ సోయి ఉండబట్టే. కానీ మోడీ సర్కార్‌కు మాత్రం అంబానీలు, ఆదానీల 'ఆత్మ'లు నిర్భరంగా ఉంటే చాలు. దేశ ప్రగతిని పట్టాలెక్కిస్తామనే మాయ మాటలతో మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ వంటి వంచనలతో కార్పొరేట్‌ మిత్రుల సేవలో మునిగిన బిజెపి సర్కార్‌ మత్తు వదిలించాలంటే ప్రజలు రంగంలోకి ప్రత్యక్షంగా దిగాల్సిందే.