Nov 30,2022 23:51

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : జిల్లాలో కొత్త పరిశ్రమల మంజూరు విషయంలో ఎటువంటి జాప్యం ఉండరాదని, పరిశ్రమల స్థాపన జిల్లాలో మరింత వేగవంతం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 64 ప్రతిపాదనలు రాగా అన్ని ప్రతిపాదనలకు పూర్తి అనుమతులను మంజూరు చేశామన్నారు. ఇవేకాకుండా జిల్లాలో మరిన్ని పరిశ్రమలు స్థాపించేలా సలహాలు, సూచనలు తెలియజేయాలని కమిటీ సభ్యులను కోరారు. జిల్లాస్థాయిలో ఇండిస్టియల్‌ పార్కు కోసం ఐదెకరాల భూమిని కేటాయించాలని కోరగా కలెక్టర్‌ అనుమతి తెలిపారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ను జిల్లాలో అమలు చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల భాగస్వామ్యంతోనే పరిశ్రమల అనుమతులు సులభతరం అవుతుందని వివరించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ జె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్‌ ఎస్‌.శంకర్‌ నాయక్‌, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు ఆర్‌.వి రమణారావు, పి.వి.ఎస్‌ రామ్మోహన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు అధినేత పి.వి.ఎస్‌ రామ్మోహనరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.