
అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ తొలగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నేడు (గురువారం) పోలింగ్ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఫలితాల ప్రకటనను మాత్రం నిలిపివేసింది. 'తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఫలితాలు ప్రకటించవద్దు' అని ఎస్ఇసిని ఆదేశించింది.చీఫ్ జస్టిస్ ఎకె గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోలింగ్ నిర్వహణకు హైకోర్టు నుండి అనుమతి రావడంతో అధికారయంత్రాంగం హుటాహుటిని రంగంలోకి దిగింది. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రిని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి ఉండటంతో పాటు, సిబ్బంది కూడా సంబంధిత కేంద్రాలకు వచ్చి ఉండటంతో పంపిణీ ప్రక్రియను చేపట్టారు. అంతకుముందు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఎస్ఇసి తరపున సీనియర్ న్యాయవాది సి.వి మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నిబంధనావళి అమలుకు కనీసం 28 రోజులు గడువు ఉండాలన్న ఆదేశం సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని చెప్పారు. ఈ దశలో పిటిషన్లో వివరాలు సక్రమంగా లేవంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ప్రక్రియను మధ్యాహ్నాం 12గంటలకు, 2.15 గంటలకు వాయిదా వేసింది. అనంతరం 'ఎస్ఇసి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపవచ్చు. అయతే, సింగిల్ బెంచ్ జడ్జి వద్ద ఉన్న రిట్ పరిష్కారం అయ్యేంత వరకు ఓట్ల లెక్కింపు చేపట్టకూడదు. ఫలితాలను ప్రకటించకూడదు' అని తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ జడ్జి ముందుకు ఈ నెల 15న కేసు విచారణకు రానున్న సంగతి తెలిసిందే.
2.46 కోట్ల మంది ఓటర్లు
హైకోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రంలో 2,46,71,002 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 660 జెడ్పిటిసి స్థానాలకు గాను 8 స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 652 స్థానాలకు గాను 126 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మార్చి 2020 నుంచి ఇప్పటి వరకూ పోటీలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన 11 మంది మరణించారు. దీంతో మిగిలిన 515 జెడ్పిటిసి స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 10,047 ఎంపిటిసి స్థానాలకు గాను 375 స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 9,672 స్థానాలకు గాను ఇప్పటికే 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది కాలంలో పోటీలో ఉన్న 81 మంది మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకు 18,782 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలకు రాష్ట్రంలో 27,751 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కోవిడ్ నిబంధనలు పాటించండి : ఎస్ఇసి
పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించి తీరాలని ఎస్ఇసి నీలం సహాని అన్నారు. మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ఎస్ఇసి సూచించారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు ఓటింగులో పాల్గనాలని విజ్ఞప్తి చేశారు.