May 01,2022 06:25
  • సైద్ధాంతికంగా ప్రజాశక్తి విశిష్టత గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామ్రాజ్యవాద వ్యతిరేకత సామ్యవాద భావజాలం, సామాజిక న్యాయం, స్త్రీ విముక్తి, మత సామరస్యం వంటి ఉన్నత గమ్యాలవైపే అది ప్రయాణిస్తుంది. వీటిని శుష్క నినాదాలుగా చెప్పడం గాక సజీవ అక్షరాస్త్రాలుగా సంధిస్తుంది. గత నలభైఏళ్లకు పైబడిన కాలంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎన్ని పరిణామాలు జరిగినా ప్రతిసారీ ఇదే సూత్రాన్ని అనుసరించింది.


నేడు మే ఒకటవ తేదీ. ప్రపంచ కార్మిక దినోత్సవమే గాక మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య జన్మదినం కూడా. మే 19 ఆయన వర్ధంతి. ఈ ఇరవై రోజులూ ప్రజాశక్తి పత్రిక పెంపుదల ఉద్యమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్ల కరోనా కల్లోలం తర్వాత మరోసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం సమయోచితంగానూ సందర్భానుసారంగానూ వుంది. కరోనా తాకిడికి బడా పత్రికలే తలకిందులైన పరిస్థితులలో అన్ని ఒడుదుడుకులు తట్టుకుని ప్రజాశక్తి తన పాత్ర సమర్థంగా నిర్వహిస్తున్నదంటే పాఠకుల ఆదరణ, ప్రజా ఉద్యమం అండదండలే కారణం. ఇప్పుడున్న పరిస్థితులలో జనానికి నిజానికి కట్టుబడిన ప్రజాశక్తి వంటి పత్రికలు మరింత అవసరమన్న మెళకువ సమాజంలో వుండబట్టే ఇదంతా సాధ్యమైంది. లాభాల ప్రలోభాలు, వ్యక్తిగత ఎజెండాలు పాలకవర్గ ప్రాపకాల ఊసే లేని ప్రజాశక్తికి ప్రజల పురోగమనమే గీటురాయి. సుందరయ్య తదితరులు ఎనభై ఏళ్లనాడు స్థాపించిన ప్రజాశక్తి అప్పటికీ ఇప్పటికి ఎప్పటికీ ప్రజా చైతన్యదీప్తిగా వెలుగొందుతూనే వుంది. సమాజ వికాసమే లక్ష్యం. దోపిడీ పీడనలను ఎదుర్కోవడమే దాని మార్గం. ప్రజాస్వామ్య లౌకిక విలువలకు, సామ్యవాద భావజాలానికి, సమత సామాజిక న్యాయాలకు కట్టుబడిన ప్రజావాణి ప్రజాశక్తి. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా సుందరయ్య, ఆయన సహచర నాయకులు నిరంతరం పత్రికలు, ప్రచురణాలయాల స్థాపనకు కృషి చేస్తూ వచ్చారు. తెలుగుగడ్డపై ఆ విధమైన యంత్రాంగాన్ని పెంపొందించారు. ఇప్పుడున్న ప్రధాన పత్రికలలో ప్రజాశక్తి ఒక్కటే విజయవాడలో మొదలైన తొలి దినపత్రిక. పాలక వర్గాలు ఎన్ని దాడులు సాగించినా, ఉద్యమ చరిత్రలో ఎన్ని ఒడుదుడుకులు నిషేధాలు, నిర్బంధాలు ఎదురైనా ద్విగుణీకృత స్ఫూర్తితో పునరావిర్భవిస్తూ వచ్చిన పత్రిక. ఎందరో కవులూ రచయితలూ మేధావులు పనిచేసిన వేదిక. తెలంగాణ సాయుధ పోరాటంపైనా ఆంధ్రలో రైతు కూలీ ఉద్యమాలపైనా ఆనాడు పాలకులు సాగించిన రాక్షస దాడికి ప్రజాశక్తి యంత్రాంగం ధ్వంసమైంది గాని ఇప్పటికీ విజయవాడ నడిబొడ్డున ప్రజాశక్తి నగర్‌ చారిత్రిక సాక్షిగా మిగిలే వుంది. నాటి అపురూప ప్రచురణలున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చి ఇక్కడే సేవలందిస్త్తున్న ఒకే పత్రిక ప్రజాశక్తి. అప్పుడే గద్దెక్కిన నరేంద్ర మోడీ ప్రభుత్వ మతోన్మాదాన్ని, అప్రజాస్వామిక పోకడలను ప్రశ్నిస్తున్న, కార్పొరేట్‌ వ్యూహాలను కళ్లకు కడుతున్న పత్రిక ప్రజాశక్తి. శ్రమజీవులు, మధ్యతరగతి ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయులు, చేతివృత్తిదార్లు, మహిళలు, మైనార్టీలు, దళిత, గిరిజనులు వివిధ తరగతుల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వెలువడుతున్న ప్రజాచైతన్య దీపిక. టిడిపి, వైసిపి ఎవరు అధికారంలో వున్నా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ ప్రజల శక్తిగా పేరొందింది. ఒకరి మీద కోపంతోనో మరొకరికి వత్తాసుగానో వ్యవహరించడం ప్రజాశక్తికి తెలియని పని. ప్రజలే దానికి పరమావధి తప్ప ఎవరో ఒక నాయకుడి భజన గీతాలు పాడదు. ప్రజల తీర్పును ప్రజాస్వామిక విలువలను గౌరవిస్తూ వాస్తవాల ప్రాతిపదికనే వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ప్రచురిస్తుంది. పాలకవర్గ బాకాలుగా అటో ఇటో చేరిపోయి కట్టుకథలు కల్మషాలు వివాద విద్వేషపు రాతలకు దిగదు. నిరాధార నిందారోపణలూ, వ్యక్తిగత దుష్ప్రచారాలు, కుల మత విభజనలూ, ధనస్వాముల పల్లకీ మోతలు ప్రజాశక్తికి తెలియవు. రాష్ట్రంలోని కేంద్రంలోని పాలక పార్టీలలో దేనికీ అది వాహిక కాదు. విస్తార జన బాహుళ్యం దానికి ప్రాణం. అందుకే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న, వివక్ష చూపుతున్న మోడీ సర్కారు నిర్వాకాలను నిరంతరం ప్రజల ముందుంచగలుగుతున్నది. ఎల్‌ఐసి నుంచి విశాఖ ఉక్కు వరకూ ఆర్టీసి పరిరక్షణ నుంచి విద్యారంగంలో విపరీతాల వరకూ ప్రతిదానిపై ప్రజాశక్తి విలువైన సమాచారం ఇచ్చింది. ఇస్తుంది. ఇటీవల పిఆర్‌సి పోరులో ప్రజాశక్తి ఇచ్చిన గణాంకాలు, వాస్తవాలు పాలకుల ప్రచారాలను పటాపంచలు చేశాయి. ఇప్పుడు సిపిఎస్‌ సమరం సందర్భంలోనూ అదే సన్నివేశం. రైతాంగ పోరాటాలనూ అది అలాగే ప్రతిబింబించింది. రాజధాని అమరావతి ప్రతిష్టంభనను తొలగించేందుకు ఎప్పటికప్పుడు అసలైన ఉద్యమాలనూ పర్యవసానాలనూ నివేదిస్తూనే వుంది. రాజకీయంగా సామాజికంగా పరస్పర అసహనం తాండవించే పరిస్థితి మీడియా వ్యవస్థలోనూ జొరబడిన ఈనాటి ప్రత్యేక పరిస్థితిలో సత్యం, సమతుల్యత కోసం ప్రజాశక్తిని ఒక గీటురాయిగా తీసుకోవడం సహజమే. ప్రజాశక్తి వార్త అంటే ప్రామాణికం. వ్యాఖ్యానం వాస్తవికం. అసత్యాలు, అతిశయాలు అసలుండవు. ఒకరికి అనుకూలం మరొకరికి వ్యతిరేకం, ఒకరుంటే ఒకలా మరొకరుంటే ఇంకోలా రాసే, చూపే జాడ్యాలకు అతీతంగా నిజాలకూ జనాలకూ కట్టుబడిందది. కృత్రిమ సంచలనాల కన్నా సమిష్టి ప్రయోజనాలు, సమైక్య ఉద్యమాలకు ఊపిరిపోయడమే దాని మార్గం.
సైద్ధాంతికంగా ప్రజాశక్తి విశిష్టత గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామ్రాజ్యవాద వ్యతిరేకత సామ్యవాద భావజాలం, సామాజిక న్యాయం, స్త్రీ విముక్తి, మత సామరస్యం వంటి ఉన్నత గమ్యాలవైపే అది ప్రయాణిస్తుంది. వీటిని శుష్క నినాదాలుగా చెప్పడం గాక సజీవ అక్షరాస్త్రాలుగా సంధిస్తుంది. గత నలభైఏళ్లకు పైబడిన కాలంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎన్ని పరిణామాలు జరిగినా ప్రతిసారీ ఇదే సూత్రాన్ని అనుసరించింది. తొలిసారి కాంగ్రెస్‌ను ఓడించి వచ్చిన ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని 1984లో వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ప్రాణవాయువైంది. అదే ప్రభుత్వం ఎన్జీవోల పోరాటంపై విరుచుకుపడినప్పుడు వారి తరపున ఎలుగెత్తింది. తొలుత కాంగ్రెస్‌ గుత్తాధిపత్యానికి తర్వాత బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా పదునైన ఆయుధమైంది. 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమై సామ్యవాద శిబిరానికి ఎదురుదెబ్బ తగిలినా ఆ చైతన్యాన్ని నిలబెట్టడంలో అగ్రగామిగా కొనసాగుతున్నది. 1992 డిసెంబరు 6న అయోధ్యలో విధ్వంసకాండను నిలదీయడంలోనూ లౌకిక భావజాలాన్ని ప్రజల్లో తీసుకుపోవడంలోనూ ప్రత్యేక సంచికల ద్వారా లక్షల కాపీలలో అందించింది. ప్రజా పోరాటాలు ఉద్యమాలు ప్రభుత్వాల అనర్థక విధానాలు ప్రైవేటీకరణ ప్రమాదాలు సందర్భం ఏదైనా అధికార ప్రతిపక్షాలలో ఎవరు వున్నా ప్రజాశక్తి ప్రత్యేక సంచికల కోసం చూడటం పరిపాటిగా మారింది. శాసనసభల్లో వారూ వీరూ కూడా ఈ పత్రికనూ ప్రత్యేక సంచికలను చూపించడం తెలిసిన విషయమే. విద్యుత్‌ ఉద్యమమైనా భూపోరాటమైనా ప్రజాశక్తి పోరాటాల పొలికేక వినిపిస్తుంది. చైతన్యం వెలిగిస్తుంది. ప్రధాన స్రవంతి పత్రికలు వామపక్ష పత్రికలు అని దాన్ని కేవలం ఒక భావానికి పరిమితమైన పత్రికగా చిత్రిస్తుంటారు. వాస్తవానికి ఇప్పుడు ప్రజాస్రవంతి ప్రధాన స్రవంతి అనదగిన పత్రిక ఏదైనా వుందంటే అది ప్రజాశక్తి వంటి ప్రజా పత్రిక మాత్రమే. మిగిలిన మీడియాలో చాలా భాగం పాక్షిక కథనాలలోనూ బాహాటంగా ఒకవైపు మాట్లాడ్డంలోనూ మునిగి తేలుతున్నది. ఆర్థిక విధానాల వల్ల కలిగే చేటు, మతతత్వ రాజకీయాల పోటు, రాష్ట్రానికి కేంద్రం అన్యాయం వంటివి దాని ఎజెండాలో లేకుండా పోయాయి. పాలక వర్గాలు ప్రజలూ అని గాక ప్రతి విషయమూ ఆయా పార్టీల నాయకుల కోణంలోనే చూడటం, చూపడం వాటి విధానం. సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ అంశాలు అస్సలు పట్టవు. రక్తికట్టే కథనాల కోసం దేన్నయినా చిలువలూ పలువలు వండి వార్చడం పరిపాటి అయింది. భారత చైనా వివాదమైనా రష్యా ఉక్రెయిన్‌ యుద్ధమైనా వాటికి ఒక వార్తా దినుసు మాత్రమే. మూఢనమ్మకాలైనా మతఛాందసమైనా ప్రజాకర్షకమైతే చాలు, నరేంద్ర మోడీని నేరుగా మోసే బడా మీడియా మోడియాగా మన కళ్ల ముందే మారిపోయింది. పత్రికా లోకంలో సంక్షోభం పెరిగే కొద్ది నేరుగా పాలక పార్టీలే ఆ సంస్థలను గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే అంబానీలు రంగంలో వుండగా తాజాగా అదానీ కూడా స్వంత మీడియా రాజ్యానికి అంకురార్పణ చేస్తున్నారు. ఈ పోకడలు ప్రజాసామ్య వికాసానికి విరుద్ధం. వాటి స్వప్రయోజనాలే సర్వస్వం. ఉన్నంతలో సమాంతర వేదికగా వున్న సోషల్‌ మీడియా కూడా ఈ దాడికి గురవుతున్నది. ట్విట్టర్‌ను ఎలన్‌ మస్క్‌ ఒక్క దెబ్బతో గుప్పిట్లోకి పెట్టుకున్నాడు. చాలా వేదికలపై కేసులు, ఫిర్యాదులు నడుస్తున్నాయి. ఎ.పి, తెలంగాణలలో మీడియా యుద్ధాలే సాగుతున్నాయి. అయితే మితవాద, మతవాద రాజకీయాలను సరళీకరణ అనే గరళీకరణ విధానాలకు వంత పాడటంలో వీటి మధ్య పెద్ద తేడా లేదు. అలాంటి స్వంత గొంతుగల మీడియా సంస్థలనూ వ్యక్తులనూ సహించే పరిస్థితి కూడా లేదు.
ఇన్ని కారణాల వల్ల ప్రజాశక్తి వంటి ప్రత్యామ్నాయ మీడియా ప్రాధాన్యత మరెన్నో రెట్లు పెరుగుతున్నది. కేవలం భావాలు సిద్ధాంతాలే గాక అన్ని రంగాలకూ అన్ని తరగతులకు అవసరమైన ఆసక్తికరమైన అంశాలను క్రమబద్దంగా జోడించిన ప్రజాశక్తి వరవడి మీకు తెలియంది కాదు. ప్రజాశక్తి ఒక సంపూర్ణ పత్రిక. సమగ్ర పత్రిక. సమాంతర పత్రిక. కరోనా వేళ కూడా ఈ కర్తవ్యంలో ప్రజాశక్తి వెనకబడలేదు. రాబోయే రోజులలో మరింత శక్తివంతంగా ఆసక్తికరంగా పత్రికను తీర్చి దిద్దాలంటే పాఠకుల, శ్రేయోభిలాషుల, సంఘాల, సంస్థల ఆదరణ మరింత పెరగాలి. ఇంటింటికీ ప్రజాశక్తి చేరాలి. ఎవరి రాజకీయాలు ఏమైనా ప్రజాశక్తి చదివితే తప్ప చాలా విషయాలు తెలియవనే వాస్తవం రీత్యా అన్ని పార్టీలూ విద్యా వ్యాపార సంస్థలు కూడా ప్రజాశక్తి తెప్పించుకోవాలి. కార్యకర్తలు, ఏజంట్లు, సిబ్బంది, ఉద్యమాల బాధ్యులు వారిని కలిసి చెప్పాలి. చందాదారులుగా చేర్పించాలి. ఆ విధంగా ఒక ప్రజల పత్రిక విస్తరించడం నేటి కలుషిత వాతావరణంలో ఆరోగ్యకరమైన ఆలోచనలు పెంపొందిస్తుంది. ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది. దురన్యాయాలు, దోపిడీలకు కళ్లెం వేస్తుంది. అందుకు మీ తోడ్పాటునివ్వండి. పత్రికను అక్కున చేర్చుకుని ఆదరించండి.
మహాకవి శ్రీశ్రీ ఒకనాడు రాసినట్లు
'రా ప్రజాశక్తి రా,
స్వచ్ఛ సత్యపు స్వర్ణకాంతులు ప్రసరించడానికి రా!
గొంతు లేనోళ్ల గోడు తెల్పడానికి రా...'
అని ఆహ్వానించండి!


- తెలకపల్లి రవి