Jul 21,2021 16:30

న్యూఢిల్లీ : ప్రజా సంక్షేమానికి బదులుగా పెగాసస్‌ స్పైవేర్‌పై మోడీ సర్కార్‌ వసూళ్ల సొమ్ము ఖర్చు పెడుతోందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పెగాసస్‌ కుంభకోణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో ప్రసంగించిన మమతా... జులై 27 లేదా 28న ప్రతిపక్షాలు నిర్వహించే సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. 'ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు మీడియా, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్‌ కమిషన్‌. కానీ ఈ మూడింటింలోనూ పెగాసస్‌ చొరబడింది' అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌ ఎంతో ప్రమాదకరమైనదని అన్నారు. తన ఫోన్‌ కూడా ట్యాప్‌ చేస్తారని..ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలతో ఫోన్లతో సంభాషించనని పేర్కొన్నారు. శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి ఎవ్వరితోనూ మాట్లాడలేనని, తన ఫోన్ కు ప్లాస్టర్ వేశానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టుకు మొర పెట్టుకున్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. అన్ని ఫోన్లు ట్యాప్‌కు గురైనందున ఈ అంశాన్ని సుమొటోగా స్వీకరించరా అని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్యానల్‌ను ఏర్పాటు చేయండని, కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే దేశాన్ని రక్షించగలదని అన్నారు.
ప్రధాని మోడీపై దీదీ విరుచుపడ్డారు. 'మోడీ, మీరు ఇలాంటివేవీ మనస్సులో పెట్టుకోకండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదు. మీరు లేదా మీ హోంమంత్రి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగపరుస్తున్నారు. బెంగాల్‌ ప్రజలు మీకు మద్దతునివ్వరు. దేశం, ప్రపంచం... మొత్తం బెంగాల్‌ ఎన్నికల్లో ఏం జరిగిందో గమనించాయి' అంటూ వ్యాఖ్యానించారు. వసూలు చేసిన పన్నులు ప్రజా సంక్షేమానికి బదులుగా స్పైవేర్‌పై ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు. 'పెట్రోల్‌ ధరలే చూడండి... ప్రజల నుండి టాక్స్‌ల రూపంలో 3.7 లక్షల కోట్లు వసూలు చేస్తోంది. ఆ సొమ్మంతా ఎక్కడకు పోతుంది' అంటూ ప్రశ్నించారు. 'వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవు. దేశంలో నిఘాను మాత్రం ఉంచాలనుకుంటున్నారు. మంత్రుల ఫోన్లతో పాటు జడ్జి ఫోన్లు కూడా ట్యాప్‌ గురయ్యాయి. మీడియా వ్యక్తులు, రాజకీయ నేతలు, న్యాయ వ్యవస్థలపై పెగాసస్‌ చొక్కుకుపోయింది' అని విమర్శించారు.