May 04,2021 07:37

   దు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా, ఎన్నికల వ్యవస్థలను ప్రభావితం చేసి, అధికార యంత్రాంగం ద్వారా అవకతవకలకు పాల్పడినా ప్రజల మద్దతును పొందడంలో బిజెపి ఘోరంగా విఫలమైంది. దేశమంతటా కరోనా మరణ మృదంగం మోగిస్తుంటే అత్యున్నత బాధ్యతల్లో వున్న నరేంద్ర మోడీ, అమిత్‌ షా ఆ విపత్తు కట్టడికి సమర్ధ చర్యలు తీసుకోవడం మానేసి కాలికి బలపం కట్టుకొని అదేపనిగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ప్రజలను విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టారు. అయితే విజ్ఞత గలిగిన ప్రజలు వాటికి తలొగ్గకుండా వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 2019 పార్లమెంటు ఎన్నికల కంటె బిజెపి కి ఓట్లు, సీట్లు గణనీయంగా తగ్గడం కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాభిప్రాయానికి నిదర్శనం. అంతేగాక భవిష్యత్‌ పరిణామాలకు ఒక ముఖ్య సూచిక. దేశమంతటా గత ఐదు మాసాలుగా సాగుతున్న రైతు ఉద్యమానికి ఈ ఫలితాలు స్ఫూర్తినిస్తాయి. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటాలకు బలం చేకూరుస్తాయి. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న ప్రజా ఉద్యమ విజయానికి ఈ ఫలితాలు తప్పక దోహదం చేస్తాయి. వచ్చే ఏడాది జరగనున్న కీలక రాష్ట్రాల ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం ఉంటుందన్న విశ్లేషకుల అంచనా కూడా సత్య దూరం కాబోదు.
   కేరళ ప్రజానీకం సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. మతోన్మాదం విషం కక్కినా, వరదలు ముంచెత్తినా, గతంలో నిపా, ఇప్పుడు కరోనా విపత్తులు కబళించాలని చూసినా ఏ మాత్రం తొణకకుండా అన్నివిధాలా ప్రజలకు అండగా నిలిచిన ఎల్‌డి ఎఫ్‌కు వరుసగా రెండవ సారి పట్టం కట్టారు. గడచిన 40 ఏళ్లుగా ఒక సారి ఎన్నుకున్న పార్టీని రెండోమారు వెంటనే గెలిపించే ఆనవాయితీ లేని కేరళీయులు ఈ సారి చరిత్రను తిరగరాశారు. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు ఎల్‌డిఎఫ్‌ కు సీట్లు, ఓట్లు, మెజార్టీలు అన్నీ పెరిగాయి. పినరయి ప్రభుత్వ పనితీరు, ప్రత్యామ్నాయ విధానాలు, ప్రకృతి వైపరీత్యా లను, వైరస్‌ విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైనం, చేపట్టిన సంక్షేమ చర్యలు, కేరళ సమాజ లౌకిక, ప్రజాతంత్ర, సామరస్య స్వభా వాన్ని పరిరక్షించడంలో నిబద్ధతలే ఎల్‌డిఎఫ్‌ విజయ రహస్యం. అధి కారం కోసం అభివృద్ధి నిరోధక, మతోన్మాద శక్తులతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ కు కేరళ ప్రజానీకం గట్టి గుణపాఠం నేర్పింది. బిజెపి కి గతంలో ఉన్న ఒక్క స్థానం కూడా పోయి, ఈ సారి శాసనసభ లోకి ప్రవేశమే దక్కలేదు.
   పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని తనకున్న ధనబలాన్ని, కండబలాన్ని, అధికారాలను దుర్వినియోగపర్చి అడ్డదారులు తొక్కిన బిజెపి కి ఆ రాష్ట్ర ప్రజలు తగిన శాస్తి చేశారు. మత విద్వేష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బిజెపిని ఓడించాలన్న కృత నిశ్చయంతో బెంగాల్‌ ప్రజలు తృణమూల్‌ వైపు మొగ్గి ఆ పార్టీకి భారీ విజయం చేకూర్చారు. ఈ ఎన్నికల్లో సంయుక్త మోర్చా, వామపక్షాల పనితీరు చాలా నిరాశాజనకంగా వుంది. తీవ్ర వైఫల్యానికి కారణాలను ఆత్మవిమర్శనా పూర్వకంగా సమీక్షించి, తగిన గుణపాఠాలు తీసుకోవడం అవసరం. బెంగాల్‌ శాసనసభలో కమ్యూనిస్టు సభ్యులొక్కరూ లేకపోవడం దురదృష్ట కరం. పదేళ్ల నిరీక్షణ అనంతరం తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డిఎంకె ఘన విజయాన్ని సాధించింది. ఆ కూటమిలోని సిపిఎం, సిపిఐ చెరి రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఆ నలుగురూ తమిళనాడు అసెంబ్లీలో ప్రజా వాణిని గట్టిగా వినిపిస్తారు. సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. మహా కూటమి ఈసారి అక్కడ గట్టి పోటీనిచ్చింది. బిజెపి కుట్రలను వమ్ము చేస్తూ సిపిఎం నేత మనోరంజన్‌ తలుక్‌దార్‌ 22 వేల ఓట్ల భారీ మెజార్టీతో సరోబోగ్‌ నియోజకవర్గంలో గెలుపొందడం అభినందనీయం. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌-బిజెపి కూటమి బొటాబొటీ మెజార్టీతో అధి కారం చేజిక్కించు కుంది. ఏదేమైనా ఈ ఎన్నికల ఫలితాలు మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే శక్తులకు మరింత బలం చేకూరుస్తాయి.