Jul 29,2021 20:36

కురుపాం : సమావేశంలో మాట్లాడుతున్నసిఐటియు నాయకులు వి.ఇందిర

కురుపాం : కార్మిక, కర్షక, రైతాంగంపై బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజలంతా ఐక్యమై తిప్పికొట్టాలని, ఇందుకు ఆగస్టు 9న మండల కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలో విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగ, వ్యవసాయ, కార్మిక చట్టాల రద్దుకు ప్రజాస్వామ్య పరిరక్షణకు సేవ్‌ ఇండియా, సేవ్‌ అగ్రికల్చర్‌ నినాదాలతో ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. సిఐటియు నియోజకవర్గ బాధ్యులు కోలక అవినాష్‌ మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర కల్పించలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, యుటిఎఫ్‌ మండల కార్యదర్శి శ్రీరాములు, గిరిజన సంఘం నాయకులు పి.తిరుపతిరావు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సరళకుమారి, సరోజ, అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీతానగరం : రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కోసం క్విట్‌ ఇండియా పోరాట స్ఫూర్తితో ఆగస్టు 9న సేవ్‌ ఇండియా దినంగా పాటించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.వెంకటరమణ, జిల్లా నాయకులు ఆర్‌.ఈశ్వర రావు కోరారు. వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని చినభోగిలి, తామరఖండి, బల్లకృష్ణాపురంలో ప్రచారం చేపట్టారు. 9న పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి సబ్‌కలెక్టరేట్‌ వరకు ర్యాలీ, అనంతరం ధర్నా చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు బి.నారాయణస్వామి, బి.అప్పారావు, జి.వెంకటరమణ, సిహెచ్‌.కృష్ణ పాల్గొన్నారు.
బలిజిపేట : రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.సత్యం నాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్తు సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌చేశారు. వీటన్నింటిపైనా వచ్చే నెల 9న చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆవు సాంబమూర్తి, వెంకటస్వామి, భానుమూర్తి, లక్ష్మమ్మ, రామారావు, మన్మథరావు, తదితరులు పాల్గొన్నారు.