Jun 10,2021 20:12
విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు, పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు

* రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు
ప్రజాశక్తి-యంత్రాంగం :
మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు మిన్నంటాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లు, నల్లజెండాలతో నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహార, ఆర్థిక సాయం అందించాలని, లేబర్‌ కోడ్‌లను, నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని నినదించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

విశాఖపట్నం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కలిగించకపోగా నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ పోతుందని విమర్శించారు. కంచరపాలెంలో. మోడీ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

కర్నూలులో సుందరయ్య సర్కిల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ మాట్లాడారు. కరోనా కష్ట కాలంలో నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని గత సంవత్సర కాలంగా మొత్తుకుంటున్నా పాలకుల్లో స్పందన లేదని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల కరోనాతో చనిపోయిన కుటుంబాల్లో ఒకొక్కరికి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు పనులు, ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో చైనా, అమెరికా, బ్రిటన్‌ ప్రభుత్వాలు ఒక మనిషికి రూ.లక్ష ఇచ్చాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం కేవలం ఐదు కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మూడవ దశ వచ్చేలోగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయాలని, ఉపాధి కోల్పోయిన వారందరికీ ఆరు నెలలపాటు రూ.7500 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు సుందరయ్య సర్కిల్‌లో నిరసనను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ.గఫూర్‌
కర్నూలు సుందరయ్య సర్కిల్‌లో నిరసనను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ.గఫూర్‌


కృష్ణాజిల్లా విజయవాడలో బిఆర్‌టిఎస్‌ రోడ్డులో నిరసన తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చౌక్‌లో నిరసన తెలిపారు. 11 మండలాల్లో ఆందోళనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెడ్‌పి సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నందం గనిరాజు సెంటర్‌లో నల్ల వ్యవసాయ చట్టాలు, లేబర్‌ కోడ్‌ ప్రతులను దహనం చేశారు.

విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డులో నిరసన తెలుపుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు,తదితరులు
విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డులో నిరసన తెలుపుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు,తదితరులు


గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. తుళ్లూరులో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల జెండాలు ప్రదర్శించారు. నరసరావుపేటలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి వెనక్కి నడుచూకుంటూ వెళ్లి కార్యాలయంలో అధికారికి వినతిపత్రం ఇచ్చారు. చిత్తూరు నగరంలో కార్మికులు నిరసన తెలిపారు. హమాలీల రాష్ట్ర అధ్యక్షులు ఆరోగ్యదాస్‌, పోస్టల్‌ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి సర్దార్‌ పాల్గొన్నారు. తిరుపతిలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు. శ్రీకాళహస్తి, మదనపల్లి, పుత్తూరు, కెవిబిపురం, సోమల, కలికిరి తదితర ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, విజయనగరం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

కాకినాడ జెడ్‌పి సెంటర్‌లో ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు
కాకినాడ జెడ్‌పి సెంటర్‌లో ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు

 

రాజమహేంద్రవరం నందం గనిరాజు సెంటర్‌లో జిఒ ప్రతులను దహనం చేస్తున్న నాయకులు
రాజమహేంద్రవరం నందం గనిరాజు సెంటర్‌లో జిఒ ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

 

తిరుపతి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న నాయకులు
తిరుపతి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న నాయకులు

 

ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న సిఐటియు నాయకులు
ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న సిఐటియు నాయకులు