Nov 07,2021 12:25

సినీ రంగంలో ఎంతో మంది వారసులు వస్తుంటారు.. అయితే వారందరూ సక్సెస్‌ అవుతారని చెప్పలేం. అలా వచ్చిన వారిలో కొద్దిమంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలా సినీ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు పునీత్‌ రాజ్‌కుమార్‌. ఎంత సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా.. టాలెంట్‌ లేకపోతే రాణించడం కష్టమే.. అంతేకాదు ప్రజాభిమానాన్ని సంపాదించడం అంత సులువేం కాదు. వీటన్నింటినీ అధిగమించి, సినీ వారసుడనే ముద్రని చెరిపేసి.. తనకంటూ ఓ ప్రత్యేకతని.. పేరుని.. క్రేజ్‌ని.. సంపాదించుకున్నాడు పునీత్‌. కన్నడ పవర్‌స్టార్‌గా పేరు సంపాదించుకుని, ప్రేక్షకులకి చేరువయ్యాడు. అలాంటి మహోన్నత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ప్రజాభిమానంతో 'పునీత్‌'

అసలు పేరు : లోహిత్‌ రాజ్‌కుమార్‌
ఇతర పేర్లు : అప్పు, యువరత్నా, పవర్‌స్టార్‌
పుట్టిన తేదీ : మార్చి 17, 1975
పుట్టిన ప్రాంతం : చెన్నరు, తమిళనాడు
నివాస ప్రాంతం : బెంగళూరు, కర్ణాటక
వృత్తి : నటుడు, గాయకుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత
జీవిత భాగస్వామి : అశ్విని రేవంత్‌
పిల్లలు : ద్రితి, వందిత
తల్లిదండ్రులు : రాజ్‌కుమార్‌, పార్వతమ్మ
తోబుట్టువులు : శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, లక్ష్మి, పూర్ణిమ

పునీత్‌ అసలు పేరు లోహిత్‌. కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా చేశారు. పునీత్‌ బాల్యమంతా మైసూరులోనే గడిచింది. చిన్నతనంలో పునీత్‌ను, పూర్ణిమను రాజ్‌కుమార్‌ సినిమా సెట్స్‌కు తీసికెళ్లేవారు. అలా చిన్న వయసు నుంచే పునీత్‌ రాజ్‌కుమార్‌ సినిమా ప్రపంచంలో పెరిగాడు. పుట్టిన ఏడాదిలోనే పునీత్‌ సినిమాలో నటించడం విశేషం. దర్శకుడు సోమశేఖర్‌ పునీత్‌ ఆరు నెలల వయస్సులో అతని థ్రిల్లర్‌ చిత్రం 'ప్రేమద కనికే'లో పునీత్‌ని నటింపజేశాడు. ఆ తర్వాత ఆరతిలో తెరపైకి తెచ్చారు. దీని తర్వాత 'సనాది అప్పన్న' వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించి మెప్పించాడు. ఉత్తమ బాలనటుడిగా అవార్డులను అందుకున్నాడు.
     పునీత్‌ 2002లో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు. తెలుగు చిత్రం 'ఇడియట్‌' రీమేక్‌గా తెరకెక్కిన 'అప్పు'తో తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నాడు. అరసు చిత్రానికి మొదటి ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. అలాగే మిలానాతో మొదటిసారి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. తెలుగు చిత్రాల రీమేక్‌ల ద్వారా భారీ విజయాలను అందుకోవడమే కాక, మంచి పాపులారిటీ దక్కించుకొని పవర్‌స్టార్‌గా అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అక్టోబర్‌ 29న గుండెపోటుతో మృతి చెందారు. తన మంచితనంతో, సేవాగుణంతో అందరి మన్ననలూ పొంది, 'పునీతు'డయ్యాడు.
 

                                                గాయకుడిగా, వ్యాఖ్యాతగా..

పునీత్‌ నటుడే కాదు గాయకుడు కూడా. జోతే జోతెయాలిలో పాడిన పాట ఆడియెన్స్‌ని అలరించింది. అలాగే పలు చిత్రాల్లోనూ పాటలు పాడారు.. తన హోమ్‌-ప్రొడక్షన్స్‌ కాకుండా ఇతర చిత్రాల కోసం పాడినందుకు వచ్చిన పారితోషకాన్ని స్వచ్ఛంద సంస్థకు అందజేసేవాడు. పునీత్‌ బుల్లితెరపై కూడా మెరిశాడు. 2012లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి కన్నడ ప్రోగ్రాంకి హోస్ట్‌గా అలరించాడు. కలర్స్‌ కన్నడ రియాలిటీ షో, అలాగే ఫ్యామిలీ పవర్‌కి హోస్ట్‌గా వ్యవహరించి, బుల్లితెరపై కూడా ఆకట్టుకున్నాడు. ఉదయ టివీలో 'నేత్రవతి' అనే సీరియల్‌ని నిర్మించాడు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించి, అభిమానులను అలరించారు.
 

                                                       సామాజిక సేవలో...

సినిమాలే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు పునీత్‌. మైసూరులో శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. 45 ఉచిత స్కూళ్లు ఏర్పాటు చేసి, 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించారు. 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు ఏర్పాటు చేశారు.
 

                                                 కరోనా కష్టాల్లోనూ...

కరోనా సమయంలోనూ ప్రజలకు వైరస్‌పై అవగాహన కలిగించడంతో పాటు భారీగా డబ్బులు విరాళంగా ఇచ్చారు. తన స్టార్‌ స్టేటస్‌ను ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఉపయోగించారు. కర్ణాటక సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఏకంగా 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. కరోనా క్రైసిస్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి కన్నడ చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేశారు. సామాజిక, మానవతా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా పునీత్‌ రాజ్‌కుమార్‌ అందరికీ ఆదర్శనీయంగా నిలిచారు.
 

                                        తల్లిదండ్రుల బాటలో నేత్ర దానం..

పునీత్‌ తల్లిదండ్రులు కూడా కళ్లను దానం చేసి, నలుగురికి చూపు రప్పించగలిగారు. సోదరుడు శివ రాజ్‌కుమార్‌ కూడా తన కళ్లను దానం చేశారు. పునీత్‌ కూడా వారి బాటలోనే తన కళ్లను దానం చేశారు. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబీకులు కళ్ల దానానికి సహకరించారు. పునీత్‌ ఆకాంక్షను నెరవేర్చారు. బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వారు పునీత్‌ మృతదేహం నుంచి కళ్లను సేకరించి, నలుగురు అంధులకు చూపునిచ్చారు. ఒక్కో కార్నియాను రెండు భాగాలుగా చేసి, అవసరమైన వాళ్లకు చూపును తిరిగిచ్చామని నేత్రాలయం వైద్యులు తెలిపారు.