Nov 25,2021 06:25

అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర శాసనసభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చేసిన ప్రకటన ఆహ్వానించదగింది. అయితే, ఆ దిశలో అడుగులు ఏ మేరకు ముందుకు పడతాయన్నదే సందిగ్ధం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలులో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడుతున్నాjంటూ పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు హామీ ఇచ్చిన మంత్రి, వాటిని తనిఖీ చేసేందుకు ఇప్పటికే విజిలెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే, ఆ కమిటీలు ఎప్పుడు ఏర్పాటు చేశారో, ఇప్పటిదాకా ఎన్ని ఆసుపత్రులను తనిఖీ చేసి, చర్యలకు సిఫార్సు చేశారో మంత్రి చెప్పలేదు. నిజానికి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల అక్రమాలపై ఫిర్యాదులు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ప్రైవేటు వైద్యం పట్ల ప్రభుత్వాల మొగ్గు ప్రారంభమైనప్పటి నుండి ఈ తరహా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో కార్పొరేట్‌ ఆసుపత్రుల అక్రమాలు, అమానవీయ తీరు పతాక స్థాయికి చేరింది. లాభార్జన తప్ప మరేమి పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెండవ విడత కరోనా విజృంభణలో ఆక్సిజన్‌ సిలిండర్‌కు రూ.10 వేల నుండి రూ. 25 వేల దాకా వసూలు చేసిన ఆసుపత్రులూ ఉన్నాయి. అయినా చర్యలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒకటి, రెండు ఘటనల్లో తప్ప మిగిలిన వాటిలో ప్రభుత్వ స్పందన దాదాపు శూన్యం! ఈ పరిస్థితే మంత్రి ప్రకటనపై సందేహాలను రేకెత్తిస్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947వ సంవత్సరంలో ప్రైవేటు రంగం 5 నుండి 10 శాతం రోగులకు సేవలందించడానికి మాత్రమే పరిమితమైంది. మిగిలినదంతా ప్రభుత్వ రంగమే! ప్రభుత్వాలు అనుసరించిన విధానాల ఫలితంగా ముఖ్యంగా 90వ దశకంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలతో ప్రైవేటు వైద్యం సేవా రంగం నుండి పరిశ్రమ స్థాయికి ఎదిగింది. హెల్త్‌ టూరిజం పేరుతో విదేశీయుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశ వ్యాప్తంగా మొత్తం అవుట్‌ పేషంట్లలో 80 నుండి 90 శాతం వాటా ప్రైవేటు ఆసుపత్రులదే! ఇన్‌పేషంట్లలో 58 నుండి 70 శాతం మంది అక్కడే ఉంటున్నారు. 50 శాతం కన్నా ఎక్కువ శిశుజననాలు ప్రైవేటు రంగంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగారుస్తూ, మరోవైపు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లనే ఈ విస్తరణ సాగింది తప్ప కార్పొరేట్‌ ఆస్పత్రులకేదో అసాధారణ సామర్ధ్యం ఉన్నందువల్ల కాదు. భవనాలు నిర్మించుకోవడానికి తక్కువ ధరకు భూములను ప్రభుత్వం ఇచ్చింది. వైద్య పరికరాలు దిగుమతి చేసుకోవడానికి 25 శాతం పన్నులు, డ్యూటీల మీద రాయితీలు ప్రకటించింది. ఇది చాలదన్నట్లు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందిలో అత్యధికులు ప్రజల డబ్బుతో నిర్వహించే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో శిక్షణ పొందిన వారే! ఇన్ని రాయితీలు పొందిన కార్పొరేట్‌ వైద్య సంస్థలు నిబంధనలను, ప్రమాణాలను సక్రమంగా పాటిస్తున్నాయా అంటే అదీ లేదు. ఫైరింజన్‌ తిరగడానికి కూడా సరైన స్థలం లేని ఆసుపత్రులు ఎన్నో! సక్రమమైన గాలి, వెలుతురు కూడా నోచుకోని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి రాయితీలు పొందిన సంస్థలు 25 శాతం మంది అవుట్‌ పేషంట్లకు, ఇన్‌పేషంట్‌ రోగుల్లో పది శాతం మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రి ఉన్న ప్రాంతాల ప్రజానీకం కోసం సంవత్సరానికి రెండు, మూడు సార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఆస్పత్రిలో ఏ సేవకు ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలిపే నోటీసు బోర్డు రిసెప్షన్‌ వద్దే అందరికి కనిపించేలా ప్రదర్శించాలి. కానీ, ఈ నిబంధనను పాటిస్తున్న ఆసుపత్రులేవి?
ఈ నేపథ్యంలో తనిఖీ, చర్యల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి. ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పెద్ద ఎత్తున చేరుతున్న ప్రజల సొమ్మును పర్యవేక్షించడానికి స్థానిక ప్రజలతో కమిటీలను ఏర్పాటు చేయాలి. అప్పుడే కార్పొరేట్‌ ఆసుపత్రుల అక్రమాలకు కళ్ళెం వేయడం సాధ్యమవుతోంది. వీటన్నింటికి మించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం పాలకుల కనీస బాధ్యత. పరీక్షా సమయంలోనే ఎవరి సామర్ధ్యమైనా నిగ్గు తేలేది. కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు డబ్బులు పిండుకునే పనిలో ఉంటే, ప్రజలను ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే. దానిని బలోపేతం చేసినప్పుడు ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇవ్వగలుగుతుంది.