Jul 29,2021 23:46

నిరసన తెలుపుతున్న సిపిఐ నాయకులు

గొలుగొండ : ప్రజాసమస్యలను ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాకిరెడ్డి రామునాయుడు డిమాండ్‌ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యాన గురువారం గొలుగొండ తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డిటికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామంలో బోయినవారిచెరువును ఆనుకొని సర్వే నంబరు 67లో 33 సెంట్ల భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈవోగా పనిచేస్తున్న పైళ్ల శేఖర్‌ బాబు కొనుగోలు చేశారని తెలిపారు. తర్వాత ఈ స్థలంతో పాటు చెరువుకు సంబంధించిన స్థలాన్ని కూడా అతను అమ్మేశారని వివరించారు. ఈ స్థలంలో రెస్టారెంట్‌ నిర్మించడం వల్ల గ్రామంలోని వర్షపు నీరు చెరువులోకి పోయే కాలువలు మూసుకుపోయాయని తెలిపారు. దీనిపై నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వేయర్లు సర్వే చేసి రెండెకరాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. అయినా నేటికీ ఎటువంటి చర్యలూ లేవన్నారు. దీనిపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేకా సత్యనారాయణ, ఎల్‌వి.రమణ, జి.రాధాకృష్ణ పాల్గొన్నారు.