Jan 25,2022 23:57

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్‌

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ వి.రాధాకృష్ణ కృపాసాగర్‌
- ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రజాశక్తి -కర్నూలు కలెక్టరేట్‌:
 ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఓటు..సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఓటు అని, పాలకుడిని నిర్దేశించే పాశుపతాస్త్రం లాంటి అమూల్యమైన ఓటును ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వినియోగించుకోని, ఓటుతో భవిష్యత్తు బాటలు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ వి.రాధాకృష్ణ కృపా సాగర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం - 2022 అవగాహన కార్యక్రమం జిల్లా స్థాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వర రావు, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ వి.రాధాకృష్ణకృపాసాగర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఎల్‌ఇడి స్క్రీన్‌ ద్వారా జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఓటర్లకు సందేశం ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జనవరి 25న జరుపుకుంటున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతను గుర్తించి, వారికి ఓటు హక్కు కల్పించడం, ఓటులో చేర్పులు, మార్పులు, చనిపోయిన వారి ఓటును తొలగించడం వీటన్నింటినీ గత మూడు, నాలుగు నెలలుగా ఇంటింటికి తిరిగి ఓటర్‌లిస్టు తయారీలో భాగస్వాములైన అధికారులు అందరికీ జిల్లా యంత్రాంగం , ఎన్నికల కమిషన్‌ తరఫున అభినందనలు తెలిపారు. మన పిల్లల భవిష్యత్తుని తద్వారా దేశ భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే ఎవరైతే మన ముందు ఉండి నడిపిస్తారో అలాంటి ఉన్నతమైన వారిని ఎన్నుకోవాలి అన్నారు. మనకు, మన పిల్లలకు మన దేశానికి దశ, దిశను నిర్దేశించే విధంగా, మన దేశాన్ని నిర్మించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు. మంచి ఆలోచనతో దూరదృష్టితో మంచి నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూభారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైందన్నారు. 1952 నుంచి భారత ఎన్నికల సంఘం సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ అన్ని దేశాల మన్ననలను పొందిందన్నారు. 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్‌ తన ఓటు నిర్భయంగా తమకు నచ్చిన వారికి ఓటు వేసి ఎన్నుకోవాలని అన్నారు. కుల, మతాలకు అతీతంగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. దేశ పౌరులకు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. అనంతరం 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న యువతకు సన్మానించి ఎపిక్‌ కార్డులను అందజేశారు. ఇంచార్జి డిఆర్‌ఒ మల్లికార్జునుడు, కర్నూలు ఆర్‌డిఒ హరిప్రసాద్‌, జిల్లా స్థాయి అధికారులు, కర్నూలు అర్బన్‌, రూరల్‌, కల్లూరు తహసీల్దార్లు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న యువకులు పాల్గొన్నారు.