Feb 07,2023 00:03

మాట్లాడుతున్న సిహెచ్‌ బాబూరావు

ప్రజాశక్తి - నరసరావుపేట : పార్లమెంట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఈనెల 22-28 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పిలుపునిచ్చారు. మోసపూరితంగా వ్యాపారం చేస్తున్న అదానీ బండారం బయటపడిందని, అయినా కార్పొరేట్లకే దాసోహం అన్నట్లు ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయనాయక్‌ అధ్యక్షత వహించారు. బాబూరావు మాట్లాడుతూ 100 కుటుంబాలకు వచ్చే ఆదాయంలో 1 శాతం పన్నులు విధించినా దేశంలో అన్ని రంగాలకు కేటాయింపులు పెంచొచ్చని, అందుకూ కేంద్రం సిద్ధం కాలనేదని అన్నారు. వంటగ్యాస్‌, ఎరువులు, పెట్రోలియం, ఆహార ఉత్పత్తులకు రాయితీని ఎత్తేశారని, రానున్న రోజుల్లో వీటి ధరలు పెరుగుతాయని చెప్పారు. పట్టణాల్లో ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తుంటే నిధుల కోత దారుణమన్నారు. బడ్జెట్లో అంధ్రప్రదేశ్‌ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని, రాజధాని అమరావతికి నిధులు కేటాయించలేదని, అమరావతి రైల్వే ప్రాజెక్ట్‌కు నిధులు కోత పెట్టారని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. పోలవరానికి నిధులు ఇవ్వలేదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయించలేదని, ఎస్సీ, ఎస్టీలకు తక్కువ బడ్జెట్‌ కేటాయించారని చెప్పారు. రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తున్న మోడీపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నిధులు సాధించలేదని వైసిపిని విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు మోడీని ఎందుకు ప్రశ్నించడ లేదన్నారు. బడ్జెట్‌పై ఏం అవగాహన ఉండి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బాగుందని చెప్పారో సమాధానం చెప్పాలన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఆహార భద్రతకు రూ.90 వేల కోట్లు తగ్గించారన్నారు. దేశ జనాభాలో 80 శాతం మంది ప్రజలు ఉపాధిహామీ పనులకు వెళుతుండగా గతంలో రూ.1.80 లక్షల కోట్లు కేటాయంచగా ప్రస్తుతం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ఎరువులకు సంబంధించి రూ.50 వేల కోట్లు రాయితీలు ఎత్తేవేసి ఆ భారాన్ని రైతులపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి గ్రీన్‌ రెవల్యూషన్‌ విభాగానికి గత బడ్జెట్లో రూ.8700 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, వ్యవసాయ విద్యాలయాలు, వ్యవసాయ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాట్లు ఏవీ ఉండవని విమర్శించారు. పంటలను బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గితే వాటిని కొనుగోలు చేయడానికి గతంలో రూ.7వేల కోట్లు కేటాయించగా వాటిని రూ.3800 కోట్లకు తగ్గించి రైతులకు తీరని ద్రోహం చేశారన్నారు. ఫుడ్‌ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్లు కోతల విధించారని, పత్తి కొనుగోలు కేంద్రాలను పూర్తిగా మూసేశారని విమర్శించారు. వీటన్నింటిపైనా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌, సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, వై.గోపాలరావు, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, జి.రవిబాబు, జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, డి.విమల, కె.హనుమంత్‌రెడ్డి, పి.మహేష్‌, జి.బాలకృష్ణ పాల్గొన్నారు.