Sep 27,2021 16:33

ప్రజాశక్తి -అనంతపురం. 
పనుల కోసం సచివాలయానికొచ్చే ప్రజలను పదే పదే తిప్పొద్దని సిబ్బందికి నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం సూచించారు. నగరంలోని 45 వ సచివాలయాన్ని సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్‌ పక్రియ ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ వేసుకునేలా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి ఏదైనా పనిమీద వస్తే సరిగా స్పందించడం లేదని, అవి కావాలి.. ఇవి కావాలి.. అని పదే పదే తిప్పుతారని మేయర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్‌ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పరిపాలన వేగవంతంగా అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను తీసుకువచ్చారన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ఆ వ్యవస్థకు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.పని మీద వచ్చే వారికి సంబంధించి ఏదైనా రికార్డులు, పేపర్లు అవసరమైతే వాటి వివరాలు ఒకేసారి చెప్పాలని,ఒక్కోసారి ఒక్కొక్కటి అడగడం వల్ల టైమ్‌ వేస్ట్‌ తప్పా పనులు ముందుకు సాగవన్నారు.ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాని మేయర్‌ సూచించారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్‌ భూషణ్‌, అనిల్‌ కుమార్‌ రెడ్డి లతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.