Oct 05,2020 23:10

మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి - తాడేపల్లి : ఆదాయం పెంచుకోవడానికి యూజర్‌ చార్జీలు, ఇతర కారణాలతో ప్రజలపై భారాలు వేయడం తగదని సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సోమవారం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవనంలో సిపిఎం రూరల్‌ కమిటీ సమావేశం పల్లె కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు విషమ షరతులకులోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. లాక్‌డౌన్‌ కాలంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ.7500లు నగదు ఇవ్వడంతోపాటు 10కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. తాడేపల్లి రూరల్‌గ్రామాల్లో చెత్త సేకరణ పేరుతో ప్రజలపై భారాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తాడేపల్లి మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకొని తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి నెలకు రూ.60లు యూజర్‌ చార్జీలు వసూలు చేయడానికి రంగం సిద్దం చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామ పంచాయతీకి పన్నులరూపంలో నిధులు వస్తున్నా సంస్కరణల్లో భాగంగా పన్నుల భారం ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. సమావేశంలో రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి, అమ్మిశెట్టి రంగారావు, కాజ వెంకటేశ్వరరావు, బొప్పన గోపాలరావు, కాట్రగడ్డ శివన్నారాయణ, కూరపాటి శేషయ్య పాల్గొన్నారు.