Jul 25,2021 18:43

పాఠశాల, కళాశాల విద్యార్థులకు సైన్స్‌ సబ్జెక్టులో ప్రయోగాలు అంటే తరగతి గదిలో నేర్పించేవి కాదు, వారిని ప్రకృతిలోకి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులను చూపించాలి అంటున్నారు కర్నాటకకు చెందిన ప్రభుత్వ పాఠశాల సైన్స్‌ టీచరు సురేఖా జగన్నాథ్‌.


కలబురాగి జిల్లాలోని బందర్‌వాడ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు సురేఖా జగన్నాథ్‌, విద్యార్థులలో ఉత్సుకతను సష్టించడానికి, విజ్ఞాన శాస్త్రంలోని వివిధ అంశాలను అర్థమయ్యేలా, ఆచరణాత్మకంగా నేర్చుకోడానికి దోహదం చేస్తున్నారు. విద్యార్థులు పొలాల్లో తిరుగుతున్నారని ఎవ్వరూ ఫిర్యాదు చేయకండి.. ఎందుకంటే నా విద్యార్థులు పొలాల్లో కీటకాల కోసం వెతుకుతారు, విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి, అవి ఎలా పెరుగుతాయి అనే అంశాలను పర్యవేక్షిస్తారు అని చెబుతున్నారు సురేఖ.


తరగతి అనేది పిల్లలకు కేవలం సైద్ధాంతిక, ప్రధాన స్రవంతి మాత్రమే కాదు, ఒక విహార యాత్రగా ఉంటుందంటారు ఆమె. ఉదాహరణకు వేరుశనగ స్వీయ పరాగసంపర్క పంట. మూలాలు మొలకెత్తడం ద్వారా అవి భూమి కింద పెరుగుతాయి. మొక్కలపై పెరిగిన పువ్వులు పరాగసంపర్కం చెంది, మూలాలతో జతచేయబడతాయి. తద్వారా మనం తినే వేరుశనగను ఏర్పరుస్తాయి. ఇది ఒక ఆసక్తికరమైన ప్రక్రియ. విద్యార్థులు ప్రతిరోజూ పురోగతిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రక్రియలను భావనల ద్వారా వివరించడం కంటే, ఆచరణాత్మకంగా పరిశీలిస్తే బాగా అర్థం చేసుకుంటారు అని అంటారు సురేఖ. విద్యార్థులు పొలాలకు వెళ్లేముందు సురేఖ రైతులతో సంప్రదిస్తారు. మొక్కల పెరుగుదల, వాటి శరీర నిర్మాణ శాస్త్రాన్ని రైతుల ద్వారా తెలుసుకుంటారు. విదార్థులను సమూహాలుగా విభజించి కార్యకలాపాలను కేటాయిస్తారు.

ప్రకృతి ద్వారా విజ్ఞానం


బయాలజీ పాఠాల కోసం సురేఖ జంతువులు, మానవుల అవయవ నమూనాలను తీసుకువస్తారు. అవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, వాటివల్ల ఉపయోగాలను వివరిస్తారు. ఇలా వివరించడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా వింటారు, అర్థం చేసుకుంటారు. ఆ విషయాలపై అనేక ప్రశ్నలు అడుగుతారు. సురేఖ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కూడా వివరణాత్మకంగా బోధిస్తారు.


విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానాన్ని సష్టించినందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో సురేఖను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో సత్కరించింది. ఒకప్పుడు డాక్టర్‌ కావాలని ఆశించిన సురేఖ సైన్స్‌ టీచర్‌గా స్థిరపడింది. సురేఖ తండ్రి రారుచూర్‌లోని ఆరోగ్య విభాగంలో పనిచేసేవారు. సురేఖ ఆసుపత్రులు, రోగులు, వైద్యులను చూస్తూ పెరిగింది. తానూ డాక్టర్‌ కావాలనుకుంది. పియుసి 1, 2లో సైన్స్‌ చదివిన తరువాత కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాస్తే ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. సురేఖకు ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేదు. అందుకే బిఎస్‌సి, ఎంఎస్‌సి పూర్తిచేసి, తరువాత గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి బిఇడి చేసింది. 2004లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. '17 సంవత్సరాలుగా రెండు వేల మంది విద్యార్థులకు సైన్స్‌ పాఠాలు నేర్పించాను. నేను డాక్టర్‌ కాలేకపోయినప్పటికీ, వైద్యులు కావాలని కోరుకునే విద్యార్థులకు సైన్స్‌ నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటున్నారు సురేఖ.