Sep 13,2021 19:13

ఉత్తరాఖండ్‌లోని అసో గ్రామానికి చెందిన కళ్యాణ్‌.. ప్రతిరోజూ 35 కిలోమీటర్లు ప్రయాణం చేసి చనోలి గ్రామ పాఠశాల విద్యార్థులకు నిత్యం పాఠాలు బోధించేవారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ వల్ల స్కూలు తెరుచుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ పిల్లలు చదువుకున్నది మర్చిపోతారని గ్రహించారు. విద్యార్థుల చదువు ఆగిపోకూడదని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. చనోలిలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి నివాసం ఆ గ్రామానికి మార్చారు.
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలను పాఠశాలకు పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో గ్రామపెద్దల సమావేశం ఏర్పాటుచేశారు. మాస్క్‌, భౌతికదూరం తదితర కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తూ పాఠాలు చెబుతానన్నారు. పిల్లల్ని స్కూలుకి పంపించేందుకు సహకరించాలని కోరారు. అందుకు పెద్దలందరూ అంగీకరించారు. ఆయన అనుకున్న లక్ష్యానికి ఆ విధంగా అడ్డంకి తొలగింది.

ప్రకృతి ఒడిలో పాఠాలు
 

పంట పొలాల మధ్య
పిల్లలు పాఠాలు చెప్పేందుకు తరగతి గదుల్ని, ఇంటర్నెట్‌ మార్గాన్ని ఆయన ఎంచుకోలేదు. ప్రకృతి ఒడిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో వారికి బోధించాలనుకున్నారు. అప్పుడే విద్యార్థులు ఉత్సాహం, ఆసక్తి కనబరుస్తారని గ్రహించారు. ఇలా నెల పాటు గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో, పచ్చని పొలాల్లో, విశాలమైన ప్రాంతాల్లో విద్యార్థులను దూరంగా దూరంగా కూర్చొబెట్టి, పాఠాలు చెప్పసాగారు. కావాల్సిన సామాగ్రిని తమతోపాటు తీసుకుని వచ్చేవారు. వారికి అందుబాటులో స్టాండ్‌ బోర్డుని ఏర్పాటుచేసి, దాని మీద పాఠాలు బోధించేవారు. కళ్యాణ్‌ నడుపుతున్న పాఠశాల గురించి తెలుసుకొని, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు వచ్చి, చేరారు. తండ్రి సంకల్పానికి కూతురు కూడా తోడైంది. కళ్యాణ్‌ కూతురు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పిల్లలకి పాఠాలు చెప్పేది. అంతేకాదు... తన స్నేహితులను కూడా పిలిపించి మరీ సబ్జెక్టుల వారీగా పాఠాలు చెప్పించేది. కళ్యాణ్‌ వద్ద చదివిన పూర్వ విద్యార్థులు యూనివర్శిటీల్లో వివిధ కోర్సులు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వారితో ఫోన్లో మాట్లాడి, ఊరికి పిలిపించారు. వారి చేత సైన్సు, సోషల్‌, సబ్జెక్టులతో పాటు సంగీతం, పాటలు, ఆర్ట్‌, పేపర్‌ క్రాఫ్టింగ్‌ వంటి సృజనాత్మక, కళాత్మక విషయాలపైనా బోధనలు చేయించారు. వృక్ష సంపద వల్ల కలిగే లాభాలను, ప్రకృతి అందించే ప్రయోజనాలపై పిల్లల్లో అవగాహన కల్పించారు. సైన్స్‌, ప్రకృతికి మధ్య వ్యత్యాసాలు చెబుతూ ప్రయోగాలు చేసి మరీ చూపించారు. తక్కువ సమయంలోనే పిల్లల్లో విజ్ఞానపరంగా వచ్చిన మార్పును గమనించిన గ్రామస్తులు కళ్యాణ్‌ను అభినందించారు.

ప్రకృతి ఒడిలో పాఠాలు
గ్రామస్తుల అనుభవాలతో పాఠాలు
గ్రామ పెద్దలు కూడా విద్యార్థులతో మాట్లాడుతూ వారి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించారు. గ్రామ సభ్యురాలైన రేవతిదేవి చేత నీతి కథలు, స్ఫూర్తిదాయక విషయాలను చెప్పించారు. పాల వ్యాపారం, పశు సంబంధ వంటి అంశాలపై గ్రామానికి చెందిన మరోవ్యక్తి భూపాలసింగ్‌తో అవగాహన కల్పించారు. కూరగాయలు వ్యాపారం, పంట సాగు విశేషాలను కూడా ఆయన అనుభవాలతోనే వివరించారు. అంతేకాదు ఆ ప్రాంత మాతృభాష అయిన 'కుమోనిని' కూడా ఆయన చొరవతో ఇప్పటి పిల్లలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రోజువారీ పాఠాలను నేర్చుకోవడమే కాకుండా స్థానిక ప్రజలతో కలిసిపోయి, గ్రామ చర్చల్లో పాల్గొనడం చేస్తున్నారు. గ్రామంలో వివిధ సమస్యలపై సర్వే చేసి, దానికి పరిష్కారమార్గలను కొనుగొనేలా నాయకత్వ లక్షణాలనూ విద్యార్థుల్లో పెంపొందిస్తున్నారు. ఇప్పుడు అక్కడ పిల్లలు మరుగునపడుతున్న జానపద పాటలను కూడా నేర్చుకోవడమే కాదు.. పాడటం గొప్ప విశేషం. గ్రామ సమీపంలో ఉన్న అడవిలోని అరుదైన వృక్ష సంపద, ఔషధ మొక్కల విశేషాలను తెలుసుకుంటున్నారు. వాటిపై పిల్లల చేత కళ్యాణ్‌ పుస్తకం రాయిస్తున్నారు.
ఈ విధమైన ప్రకృతితో మమేకమైన విద్యను బోధిస్తున్న తీరును చూసి, నెల రోజుల్లో ప్రయివేటు స్కూలు పిల్లలు కూడా వచ్చి చేరారు. విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చి, కళ్యాణ్‌ తన లక్ష్యం కోసం అనుక్షణం కృషి చేస్తున్నారు. కొత్త విషయాల్ని పిల్లలతో ప్రాక్టికల్స్‌ చేయించి, వారిలో విషయ పరిజ్ఞానం పెంచుతున్నారు. కళ్యాణ్‌ని అధికారులు కూడా ప్రోత్సహించడమే కాకుండా ఈ విధమైన బోధనాపద్ధతిని అన్ని మండల పరిధి స్కూళ్లల్లో అవలంబించేందుకు ఆదేశాలు జారీ చేయడం ఆదర్శనీయం.