May 03,2021 09:04
  • మాస్కులు, గ్లౌజులు,శానిటైజర్లు నిల్‌
  • రక్షణ లేకుండానే ప్రతికూల పరిస్థితుల్లో విధులు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కరోనా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. సరైన రక్షణ సౌకర్యాలు లేకపోయినా అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను పలువురు సొంతంగా కొనుగోలు చేస్తుండగా అనేకమంది అవేమీ లేకుండానే సేవలు కొనసాగిస్తున్నారు.
   తూర్పుగోదావరి జిల్లాలో రోజుకి వెయ్యి నుంచి 2,600 కేసులు వెలుగు చూస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కేసుల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు జిల్లాలోనే నమోదయ్యాయి. ఆదివారం వరకూ 1,47,292 మందికి పాజిటివ్‌లుగా నిర్ధారణయ్యాయి. 709 మంది మరణించారు. ప్రస్తుతం 15,878 యాక్టివ్‌ కేసులు జిల్లాలో ఉన్నాయి. హోం ఐసోలేషన్లో 11 వేల మందికిపైగా ఉన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో జిల్లా వ్యాప్తంగా 4,500 మంది ఆశలు, సుమారు 5 వేల మంది ఎఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. ప్రతి 1000 మంది జనాభా పరిధిలో పని చేసే ఒక్కో ఆశ, ఎఎన్‌ఎంలకు నిత్యం 250 నుండి 300 ఇళ్లను సందర్శించి, సర్వే నిర్వహించాల్సి ఉంది. పాజిటివ్‌ బాధితులను ఆస్పత్రులకు తరలించే సమయంలో అతి సమీపంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి డాక్టర్ల సూచనల మేరకు మందులు, ఆహారం అందిస్తున్నారు. కిట్లను బాధితుల వద్దకు చెరవేస్తున్నారు. కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆశ వర్కర్లు రోజుకు రెండు మాస్కులు వినియోగించాల్సి ఉండగా సెకండ్‌ వేవ్‌ మొదలైన రెండు నెలల కాలంలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇచ్చే అరకొర వేతనాల్లో సొంతంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారం అవుతుందని పలువురు బాధ పడుతున్నారు.
 

                                                         రక్షణ సౌకర్యాలు మృగ్యం

   అధికారుల ఆదేశాల ప్రకారం మేము హోం ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్‌ కేసుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని డాక్టర్లకు తెలియజేస్తున్నాం. కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదు. చాలీచాలని జీతాలతో కొన్నిసార్లు మేమే మాస్కులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి రక్షణ సౌకర్యాలు కల్పించాలి.
                                                                                 - ఎన్‌.ఈశ్వరి, ఆశ కార్యకర్త, రంగంపేట పిహెచ్‌సి

                                                               పరికరాలు లేవు

   హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల వద్దకు వెళ్లి వారికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సి వస్తోంది. అదే సందర్భంలో వ్యాధిగ్రస్తులతో పాటు కోవిడ్‌ అనుమానం ఉన్న వారిని థర్మో స్కానర్‌ ద్వారా వారి శరీరంలో ఉష్ణోగ్రతలు చూడాల్సి వస్తుంది. పల్స్‌ ఆక్సీ మీటర్ల ద్వారా ఆక్సిజన్‌ శాతం, గుండె కొట్టుకునే వేగం నమోదు చేయాల్సి వస్తుంది. గతేడాది ఇచ్చిన పరికరాలు సక్రమంగా పని చేయడం లేదు. దీంతో వాటిని సొంతంగా కొనుగోలు చేసుకుని పరీక్షలు జరుపుతున్నాం.
                                                                                                - ఎ.నీరజ, ఎఎన్‌ఎం,కాకినాడ